కేంద్ర ప్రభుత్వంలో అత్యంత శక్తివంతురాలు ఆమె...

Gullapally Venkatesh

రాజకీయాల్లో మహిళలు రాణించడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తాయి పార్టీలు. ఇచ్చినా సరే అవి ఎంత వరకు అమలు అవుతాయో తెలియదు. ఇక కేంద్ర పదవులు నిర్వహించడం అంటే కత్తి మీద సాము. ఇందిరా గాంధీ లాంటి వ్యక్తి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. మానసికంగా ఎంతో దృడంగా ఉండాలి. అలా ఉంటేనే విమర్శలను తట్టుకుని, వ్యూహాలను ఎదుర్కొని నిలబడతారు. అలా నిలబడిన వారిలో ప్రస్తుత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకరు. 

 

సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి చేరిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్‌. నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. 1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు.

 

అత్తా మామలు కాంగ్రెస్ లో ఉన్నా సరే ఆమె మాత్రం బిజెపి వైపు వెళ్ళారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు. ఇలా అంచెలు అంచెలు ఎదిగి పార్టీ వాణిని బలంగా వినిపించారు ఆమె. అలా దేశానికి పూర్తి స్థాయిలో రక్షణ శాఖా మంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇప్పుడు ఆమె కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. మోడీ కేబినేట్ లో సమర్దవంత మంత్రిగా ఆమెకు పేరు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: