విజయం మీదే: సుఖదుఃఖాలకు బానిస కాకండి...

VAMSI
జీవితం అనేది మనకు పుట్టిన రోజు నుండి మరణించే వరకు విభిన్న భావాల సంగమం అని చెప్పాలి. ఇందులో సమస్యలు, సుఖ దుఃఖాలు సర్వ సాధారణం. ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు, కాలం అన్ని వేళలా మనకు కలిసి రాదు, కలిసి రావాలని కూడా లేదు. అలాంటప్పుడు ఇవన్నీ తెలిసి కూడా మనసు కూడా ఇంద్రియ గోచరములైన అంశాల వెంటబడి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వాటి వల్ల కలిగే ఫలితాలకు లోబడి కకావికలమౌతుంది. ఒక్కసారి కనుక మనకు సమయం అనుకూలించక కష్టాలు ఎదురైతే ఆ గందర గోళంలో తొందర పాటుతో మనసు సతమతమవుతూ చివరికి కుంగి మనస్థాపం చెంది అలసిపోతుంది.
ఇలాంటివన్నీ మన విజయానికి అవరోధాలుగా మారుతాయి. చంచలమైన మనసుతో ఏది సాధించడం అంత సులభం కాదు. మనసుని స్థిమితంగా ఉంచుకుని, ఆలోచనలను అదుపులో పెట్టుకున్నప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది. తద్వారా అన్ని మనకు పాజిటివ్ గానే కనపడుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటేనే వచ్చిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వీలైనంతలో ఆ సమస్యల నుండి బయట పడటానికి మార్గం కనపడుతుంది. మనిషి సుఖాలను పొందినప్పుడు అత్యదికంగా ఆనందించి.. అవి దూరం కాగానే దుఃఖ సంద్రంలో మునిగి ఆవేదన చెంది కలత చెంది ఇలా సుఖ, దుఃఖాల మధ్యే జీవితం గడచిపోతే ఇక గమ్యం చేరుకునేది ఎప్పటికి సాధ్యం అవుతుంది.
అందుకే ముందుగా మనస్సును దృఢం చేసుకోండి ప్రతి సందర్భాన్ని సానుకూలంగా ఆహ్వానించి ఎదుర్కొని నిలబడండి. అంతే కానీ మీకున్న కష్టాలను తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. కాబట్టి మనసులో ఎటువంటి బాధలు ఉన్నా అన్నింటినీ వదిలేసి దైర్యంగా లక్ష్యం వైపు అడుగులు వేయండి. మీ శ్రమే మీ ఆయుధంగా మలుచుకుని ముందుకు సాగితే ఎటువంటి కష్టమైనా మీకు సలాం అనాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: