విజయం మీదే: బంధ‌మొక ప్ర‌శ్న కాకూడ‌దంటే ?

VAMSI
ఆనాటి మనిషికి నేటి మనిషికి ఎంతో వ్యత్యాసం ఉంది. జీవన స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. కాలం మారుతున్న కొద్దీ మనుషులు కూడా మారుతున్నారు, వారి ఆలోచనలు మారుతున్నాయి, జీవనశైలి మారుతోంది. అప్పటికీ ఇప్పటికీ అభివృద్ధి కూడా ఎంతో పెరిగిందనే చెప్పాలి. అదే విధంగా మనుషుల మద్య బంధాలలో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. మానవ సంబంధాలు పూర్తిగా తారు మారు అయిపోతున్నాయి. ఒక్కసారి కనుక పాత రోజుల్ని ఆ కాలాన్ని  కనుక గుర్తుచేసుకుంటే...అప్పట్లో ప్రజలు తమ బంధువులనే కాకుండా, ఇరుగు పొరుగు వారిని కూడా తమ బంధువుల లాగా బంధాలను కలుపుకొని పోయే వారు. బాబాయ్, మామ, అత్త, పెద్దమ్మ ఇలా వరుసలు పెట్టి పిలుచుకుంటూ అంతా ఒక కుటుంబానికి చెందినవారిలా కలసి కట్టుగా జీవించే వారు. ఎవరింట్లో శుభకార్యమైనా మిగిలినవారంతా వాలిపోయి చేదోడువాదోడుగా సహాయం చేసేవారు. 

కష్టాల్లోనూ తోడుగా ఉంటూ అంతా కలసి జీవించే వారు. సాయంకాలం అయితే ఆరు బయట కూర్చుని ఆ సందడే వేరు. కాని నేటి సమాజంలో ఇరుగు పొరుగు వారి సంగతి పక్కన పెడితే కనీసం సొంత ఆత్మీయులని కూడా చూడడం లేదు. ఎవరి జీవితం వారిది అయిపోయింది. కనీసం ఒకే కుటుంబంలో నివసించే కుటుంబ సభ్యులు సైతం ఎదో అలా మెకానికల్ గా కలసి జీవిస్తున్నారు. కానీ, ఆత్మీయ అనుబంధాలు కరువయ్యాయి.  అందరు ఇలానే ఉన్నారు అనలేము. కానీ చాలామంది మాత్రం ఇటువంటి జీవనానికే అలవాటు పడిపోయారు. మనుషులతో కంటే కూడా ఆన్లైన్లో ఎక్కువగా ఉంటున్నారు. సెల్ఫోన్, లాప్టాప్, వీడియో గేమ్స్ అని పట్టుకు తిరుగుతున్నారు. వాటిలోనే వారి ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఎప్పుడో ఏమిటో తప్ప ఇతరులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం లేదు. కనిపిస్తే హాయ్, బాయ్ లు చెప్పి అదే ఎక్కువ అన్నట్లుగా ఉండిపోతున్నారు.

దీని వలన మానవ సంబందాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. పెద్ద వారిని చూసి పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. అయినా ఇప్పటికీ పరిస్థితులు చక్కబెట్టే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా మన జీవన విధానాన్ని కొద్దిగానైనా మార్చుకోగలిగితే ... బంధాలకు విలువిచ్చి మనుషులను  కలుపుకోవడం,  అందరితోనూ కలుపుగోలుగా ఉండడం. ఎంత బిజీగా ఉన్నా మనవాళ్లు అనుకున్న వారి కోసం కాస్త సమయాన్ని కేటాయించడం వంటివి చేయడం ద్వారా మళ్లీ మానవ సంబంధాలు మునుపటిలా వికసిస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: