IndiGo : దారుణంగా ప్రవర్తిస్తున్న స్టాఫ్.. !

Purushottham Vinay
ఇక గుక్కపెట్టి ఏడుస్తున్నా కూడా తన ఆరేళ్ల కుమార్తెకు ఇండిగో విమానయాన సంస్థ (IndiGo airlines) ఆహారం అందించలేదని ఓ ప్రయాణికుడు తన బాధను వెల్లగక్కాడు.ఏడుస్తున్న ఆ చిన్నారికి ఆహారం అందించకుండా.. కార్పొరేట్‌ ప్రయాణికులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని విమాన సిబ్బంది తెగేసి చెప్పినట్లు ఆయన ఆరోపించారు. దీంతో తన కుమార్తె విమాన ప్రయాణం మొత్తం కూడా ఆకలితో ఏడుస్తూనే ఉందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెలిబుచ్చాడు.'ఈ ఇండిగో (IndiGo) సంస్థ మాకు గొప్ప అనుభవాన్ని మిగిల్చింది.. మా ఆరేళ్ల కుమార్తె ఆకలితో ఏడుస్తుంటడంతో ఆహారం అందించాలని ఆ విమాన సిబ్బందిని అభ్యర్థించా. ఎలాంటి ఆహారం ఉన్నాసరే ఇవ్వాలని అలాగే దానికి డబ్బులు చెల్లిస్తానని కూడా చెప్పాను. కానీ కార్పొరేట్‌ క్లయింట్లకు ముందు వడ్డించాలంటూ నా అభ్యర్థనను ఆ సిబ్బంది తిరస్కరించారు. విమానంలో నా కుమార్తె ఇంకా ఏడుస్తూనే ఉంది, అయినప్పటికీ వారు ఆహారం అందించలేదు' అని సోషల్ మీడియాలో సదరు ప్రయాణికుడు వాపోయారు.


ఆ ప్రయాణికుడి పోస్ట్ కాస్తా వైరల్‌గా మారడంతో ఇండిగో సంస్థ స్పందించింది. అతను పెట్టిన పోస్ట్ ను ట్యాగ్‌ చేస్తూ.. 'మీకు ఏం జరిగిందో మేం పూర్తిగా అర్థం చేసుకోగలం. మీ కుమార్తె ఇప్పుడు క్షేమంగానే ఉందని మేము భావిస్తున్నాం. ఇక ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించి, రేపు మిమ్మల్ని సంప్రదిస్తాం' అంటూ తెలిపింది. అలాగే విమానయాన సంస్థ మరో ప్రతినిధి కూడా స్పందించారు. 'ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీకు జరిగినదాని పట్ల మేము క్షమాపణలు కోరుతున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు సంబంధిత బృందంతో మీ అభిప్రాయాన్ని మేము పంచుకున్నాం. భవిష్యత్తులో మీకు మెరుగైన సేవలందించేందుకు మేము ఎదురుచూస్తున్నాం' అంటూ పేర్కొన్నారు.


ఇక ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది కొద్దిరోజుల క్రితం ఓ దివ్యాంగ బాలుడితో కూడా అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆ దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు గాను ఇండిగో సిబ్బంది నిరాకరించారు. ఆ చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఆ చిన్నారిని ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ఆ ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో డీజీసీఏ విచారణకు ఆదేశించి సంస్థకు జరిమానా కూడా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: