ఈ జీన్స్ వేసుకుంటే నో యాక్సిడెంట్.. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి..

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: కారు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ఎయిర్ బాగ్స్ వాడతారని తెలుసు కదా..! కానీ బైక్ ప్రమాదాల్లో మాత్రం ఇది సాధ్యం కాదు. దీనివల్ల ద్విచక్రవాహన ప్రమాదాల్లో మరణాల సంఖ్యను అరికట్టడం సాధ్యపడడం లేదు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది స్వీడన్ కు చెందిన “ఎయిర్ బ్యాగ్ ఇన్‌సైడ్ స్వీడన్ ఏబీ” అనే సంస్థ. ఈ సంస్థకు చెందిన షహ్రీవర్ అనే డిజైనర్ ద్విచక్ర వాహన ప్రమాదాలను అరికట్టేందుకు ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ను తయారు చేశారు. 


వీటిని ధరించి ప్రయాణించే సమయంలో అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే ఈ జీన్స్ లోని ఎయిర్ బాగ్స్ తెరుచుకుంటాయి. దాంతో డ్రైవర్ ప్రాణాలు పోకుండా ఉండడమే కాకుండా స్వల్ప గాయాలతోనే బయటపడే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ప్రయోగం 16 ఏళ్ల క్రితమే చేశారు. అప్పుడు ఆ జీన్స్‌లో తోలు పొరమాత్రమే ఉండేది.. ఇప్పుడు దానిని ఆధునిక టెక్నాలజీతో మరింత అభివృద్ధి చేసి సూపర్ స్ట్రాంగ్ జీన్స్ ప్రోటో టైప్‌ను రెడీ చేశారు.


 ప్రమాదం జరిగిన వెంటనే కార్లలో మాదిరి ఈ జీన్స్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ తెరచుకుని వాటిల్లోకి గాలివస్తుంది. దీంతో శరీరం కిందపడినా తీవ్ర స్థాయిలో గాయాలు కావు. అయితే ఈ ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌కు ఇంకా యూరోపియన్ హెల్త్, స్టాండర్ట్స్ నుంచి ధృవీకరణ రాలేదని, త్వరలో లభిస్తుందన్న ఆశతో ఉన్నానని షహ్రీవర్ చెబుతున్నారు. అంతేకాదు.. ఈ కొత్త జీన్స్ వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ముఖ్యంగా దిగువ అన్ని భాగాలకు రక్షణ లభిస్తుందని, ఇలాంటి ఆవిష్కరణ ఇప్పటివరకు జరగలేదని ఆయన చెప్పారు. పరీక్ష, ఆమోదం తరువాత మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు.


ఈ జీన్స్ అభివృద్ధి కోసం కంపెనీ.. యూరోపియన్ యూనియన్ నుంచి రూ.1,31,37,750 సమీకరించింది. 2022లో ఈ జీన్స్‌ మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మరణాల సంఖ్య అధికంగా రోడ్డు ప్రమాదాల్లో నమోదవుతున్నాయి. ఇక మనదేశంలో అయితే సగటున ప్రతిరోజూ 1,230 రోడ్డు ప్రమాదాలు జరిగేతే 414 మరణాలు నమోదవుతున్నాయని అధికారిక అంచనా. అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాల్లో బైక్ యాక్సిడెంట్ మరణాలు ఎక్కువే. ఈ నేపథ్యంలో బైక్ పై ప్రయాణించే వారికి ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ఎంతో గొప్పగా ఉపయోగపడతాయి. ప్రమాదాలను అరికడతాయని అనేకమంది అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: