5జి టెక్నాలిజీయే రాలేదు.. అప్పుడే 6జి పై కేంద్రం క‌స‌ర‌త్తు..!

Paloji Vinay
రోజు రోజుకు సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఊహ‌ల‌కంద‌ని విధంగా ముందుకు దూసుకెళ్లిపోతోంది. టెక్నాల‌జీ ప్ర‌స్తుతం 4జి సాంకేతిక అందుబాటులో ఉండ‌గా 5జీ టెక్నాల‌జీని తీసుకువ‌చ్చేందుకు ఇప్పుడిప్పుడే టెలికామ్ కంపెనీలు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అయితే, 5జి సాంకేతిక‌ రాక‌ముందే 6 జి మీద దృష్టి పెట్టాల‌ని ఆ దిశ‌గా ప‌నులు మొద‌లు పెట్టాల‌ని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ రంగ‌ యాజమాన్యంలోని టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా 6 జీ టెక్నాలజీ మీద పనులను మొద‌లు పెట్టాల‌ని కోరారు టెలికాం కార్యదర్శి కె రాజరామన్. 


ఇప్పటికే హువావే, శామ్ సంగ్, ఎల్‌జీ అలాగే ఇతరత్ర  కంపెనీలు 6 జీ టెక్నాలజీలపై ప‌రిశోధ‌న‌ల‌ను మొద‌లు పెట్టాయి.  కాగా, టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న‌ నేపథ్యంలో 6జి టెక్నాలజీ 5 జి సాంకేతిక‌త‌ కంటే 50 రెట్లు అధిక వేగంతో ఉంటుందని తెలుస్తోంది.  2028-2030 వ‌ర‌కు వాణిజ్యపరంగా అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వొడాఫోన్ ఐడియా (వి) భారత్‌లో ట్రయల్స్ నిర్వ‌హించిన సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలు న‌మోదు చేసిన‌ట్టు పేర్కొంది. అయితే, భార‌త‌దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4 జీ టాప్ వేగాన్ని అందుకుంది అని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) వెల్ల‌డించింది.

కాగా, అక్టోబర్‌ 1వ తేదీన సీ-డీఓటీ కార్యదర్శిగా రాజరామన్ బాధ్యతలు చేపట్టారు. అనంత‌రం టెక్నాలజీ వాణిజ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు రాజ‌రామ‌న్‌.  వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం సి-డీఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయల‌ని, అలాగే దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీ-డీఓటీకి చెప్పారు. అయితే,  ఇప్పటికే 6జి టెక్నాల‌జీకి సంబంధించిన ప‌రిశోధ‌న‌ల ప‌నుల‌ను అమెరికా, చైనా వంటి దేశాలు ప్రారంభించాయి. ఇప్పుడు అమెరికా, చైనాల‌కు పోటీగా మన దేశంలో కూడా 6జి టెక్నాలజీపై పని చేయాలని సీ-డీఓటీకి కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: