తొలి వన్డే టీమిండియా జట్టు ఇదే...!

Podili Ravindranath
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ఓడింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఎలాగైనా వన్డే సిరీస్‌ గెలుచుకోవాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. అలాగే 2016 అక్టోబర్ తర్వాత విరాట్ కోహ్లీ తొలిసారి కెప్టెన్‌గా కాకుండా... ఓ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నారు. దీంతో వన్డే సిరీస్‌పై మరింత ఆసక్తి రేగింది. మూడు వన్డేల సిరీస్‌ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి వన్డే మ్యాచ్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. తొలి వన్డే పార్ల్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో పూర్తి యువకులతో కూడిన భారత జట్టు వన్డే సిరీస్‌ను గెలుచుకునేందుకు ఇప్పటి నుంచి నెట్ ప్రాక్టీస్‌పై దృష్టి సారించింది.
దాదాపు ఏడేళ్లుగా భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ... ఇప్పుడు మరొకరి సారధ్యంలో పయనించాల్సి ఉంది. ఇప్పటి వరకు జూనియర్లకు సూచనలు ఇస్తూ వస్తున్న విరాట్... ఇప్పుడు జూనియర్ మాట వింటాడా లేదా అనేది ప్రస్తుతం క్రికెట్ లవర్స్ మదిలో ఉన్న ప్రశ్న. అటు ఇప్పటికే కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న విరాట్.. ఫామ్ కొరతతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడం వల్ల... బ్యాటింగ్‌పైనే దృష్టి సారించి తన మునుపటి ఫామ్ రాబట్టుకుంటారని అంతా ఆశిస్తున్నారు. గాయం కారణంగా రోహిత్ తప్పుకోవడంతో... ఓపెనర్ శిఖర్ ధావన్‌పై భారం పడింది. శ్రీలంకతో సిరీస్ తర్వాత... టీమిండియాకు ధావన్ దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో ధావన్ విఫలమైతే... వరల్డ్ కప్ ఆశలు గల్లంతు అయినట్లే. ఇప్పటికే ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌ల రూపంలో ధావన్‌కు పోటీ ఎదురవుతోంది. కేఎల్ రాహుల్‌, ధావన్ జోడీ ఓపెనింగ్ చేయనుండగా... వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా ప్రత్యామ్నాయంగా వెంకటేశ్ అయ్యర్‌ను సిద్దం చేయాలని భావిస్తున్న టీమ్‌మేనేజ్‌మెంట్ ఫస్ట్ వన్డేల్లో అతనికి చోటిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: