బీసీసీఐపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్...!

Podili Ravindranath
టీమ్ ఇండియా ట్వంటీ 20 సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ స్వయంగా తప్పుకున్నారు. ఆ స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే అనూహ్యంగా ఇప్పుడు వన్డే జట్టు సారధ్య బాధ్యతల నుంచి కోహ్లీని బీసీసీఐ తప్పించింది. మరో 15 రోజుల్లో సౌతాఫ్రికాలో భారత జట్టు పర్యటించనుంది. పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్‌లు టీమిండియా ఆడనుంది. తొలి టెస్టు మ్యాచ్ ఈ నెల 26వ తేదీ నుంచి సెంచూరియన్ పార్క్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వైరస్ కారణంగా మూడు టీ 20 మ్యాచ్‌లను బీసీసీఐ రద్దు చేసింది.  ఈ సిరీస్ కోసం ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ ఎంపిక చేసింది. టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తారు. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. అయితే వన్డే జట్టు ఎంపికలో మాత్రం బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టు కెప్టెన్‌గా కోహ్లీకి బదులుగా రోహిత్‌ శర్మను ఎంపిక చేసింది.
ఇప్పటికే టీ 20 బాధ్యతలు నిర్వహిస్తున్న రోహిత్... ఇకపై వన్డేల బాధ్యత కూడా చూడనున్నారు. ఇదే ఇప్పుడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అభిమానులకు మింగుడు పడటం లేదు. బీసీసీఐపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలి, కార్యదర్శి జై షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారత్‌లో క్రికెట్ అనేది లేకుండా వీరిద్దరు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి కొందరు అయితే షేమ్ ఆన్ బీసీసీఐ అంటూ ట్యాగ్ లైన్ తగిలించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కోహ్లీని ఘోరంగా అవమానించారంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ ముందు కోహ్లీని ఎందుకు మార్చారంటూ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. విరాట్ రికార్డులు మీకు తెలియదా అంటూ నిలదీస్తున్నారు కూడా. కోహ్లీ వన్డే విన్నింగ్ పర్సంటేజ్ 70 శాతం. ఇదే విషయాన్ని పోస్ట్ చేసిన విరాట్ ఫ్యాన్స్... ‌బీసీసీఐ క్రికెట్‌లో రాజకీయాలు చేస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. భారత్‌లో కొంతమంది క్రికెట్‌ను కంట్రోల్ చేస్తున్నారంటూ బీసీసీఐకి కొత్త అర్థం ఇచ్చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: