విండీస్ వీరుడు 'రస్సెల్' కి అన్ని కోట్లు అవసరమా?

VAMSI
ఐపీఎల్ లో వచ్చే సంవత్సరం జరగబోయే సీజన్ 15 కోసం ఐపీఎల్ పాలక మండలి మెగా వేలాన్ని జరపనుంది. ఈ వేలం జనవరిలో ఉండనుందని సమాచారం. ఇప్పుడు ఐపీఎల్ లో ఉన్న ఎనిమిది జట్లలో కేవలం అంటిపెట్టుకున్న ప్లేయర్స్ మాత్రమే ఉండగా, మిగిలిన వారందరూ వేలల్లోకి వచ్చేశారు. మారుతున్న కాలంలో కొత్త కొత్త టాలెంట్ ఉన్న ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. ఒక్క విషయం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఈ సారి చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు మొండిచేయి తప్పదు. ఎందుకంటే టీ 20 లాంటి పొట్టి ఫార్మాట్ లో రాణించాలంటే ఫిట్ గా ఉండాలి. పైగా సీనియర్ ఆటగాళ్లు చాలా వరకు దూకుడుగా ఆడడంలో వెనుకంజలో ఉంటారు.
అందుకే ఫ్రాంచైజీలు సైతం కుర్ర ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా మొన్నటితో ముగిసిన రీటెన్షన్ ప్రక్రియలో చాలా మంది ఆటగాళ్లకు తమ ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి అని చెప్పాలి. అసలు ఊహించని వారిని రీటైన్ చేసుకున్న జట్లు, ఖచ్చితంగా వీరిని రీటైన్ చేసుకుంటారని అనుకున్న ఆటగాళ్లను వదిలేశారు. ఈ విషయంలో పలువురు ఆటగాళ్లపై ట్రోల్స్ నడుస్తున్నాయి. కానీ కేకేఆర్ జట్టుతో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆండ్రీ రస్సెల్ ను రీటైన్ చేసుకోవడంపై కామెంట్స్ వినబడుతున్నాయి. గత సీజన్ లో రస్సెల్ తన స్థాయికి తగినట్లుగా ఆడలేదు. గతంలో ఉన్నంత ఫామ్ లో అయితే లేడు. అదే విధంగా ఎప్పుడూ ఏదో ఒక గాయం బారిన పడుతున్నాడు.
మ్యాచ్ లో ఆడాలంటే ఫిట్నెస్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ఒక భారీ షాట్ ఆడాలన్నా, బౌలింగ్ లో మంచి పేస్ ఉండాలన్నా, బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పెట్టాలన్నా ఫిట్నెస్ అనేది చాలా కీలకం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోకుండా కేవలం గత ఫామ్ ను ఆధారంగా చేసుకుని రస్సెల్ ను 16 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. మరి ఈ అమౌంట్ కు రస్సెల్ న్యాయం చేస్తాడా లేదా అన్నది తెలియాలంటే వచ్చే సీజన్ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: