శ్రేయ‌స్‌ను దూరం పెట్టి ఢిల్లీ త‌ప్పు చేసిందా..!

VUYYURU SUBHASH
ఐపీఎల్ టీం ఢిల్లీ దిద్దుకోలేని త‌ప్పు చేసిందా? త‌మ టీం మాజీ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను వ‌దులుకొని అభిమానుల ఆగ్ర‌హానికి గురైందా? ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యం ఇదే అనుమానాల‌కు తావిస్తోంది. బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు త‌మ ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకునేందుకు ఇచ్చిన‌ గ‌డువు న‌వంబ‌రు 30తో ముగిసింది. డిసెంబ‌రులో మెగా వేలానికి వెళ్లేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. మ‌రో రెండు కొత్త యాజ‌మాన్యాలు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో చేర‌నున్నాయి. వీటికి అనుకూలంగా ఉండేందుకు మిగ‌తా టీంలు త‌మ ఆట‌గాళ్ల‌ను వ‌దులుకోవాల్సి ఉంది.
ఢిల్లీని నిల‌బెట్టిన శ్రేయ‌స్‌..!
ఢిల్లీ మాజీ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ గ‌త రెండు ప‌ర్యాయాలు జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపించాడు. ప్ర‌తీసారి ప‌రాజ‌యాల‌తో కొట్టుమిట్టాడుతున్నజ‌ట్టును ముందుకు న‌డిపించాడు. 2018 వ‌ర‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ గా ఉన్న జ‌ట్టుకు గౌత‌మ్ గంభీర్ నాయ‌క‌త్వం వ‌హించాడు. 2019లో గౌత‌మ్ గంభీర్ నుంచి ప‌గ్గాలు అందుకున్న శ్రేయ‌స్ తొలి ద‌శలోనే జ‌ట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. 2020లో అత‌డి నాయ‌క‌త్వంలోనే జ‌ట్టు ఫైన‌ల్‌కు వెళ్లింది. ఫైన‌ల్‌లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ముంబై చేతిలో ఓడి ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది.
శ్రేయ‌స్‌కు అచ్చిరాని 2021
ఢిల్లీ జ‌ట్టును ఒక‌సారి ప్లేఆఫ్స్‌, మ‌రొక‌సారి ఫైన‌ల్‌కు చేర్చిన అయ్య‌ర్‌కు 2021 క‌లిసి రాలేద‌నే చెప్పాలి. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరం కావ‌డంతో యువ ఆట‌గాడు, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు ఢిల్లీ సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కోచ్ పాంటింగ్ కూడా రిష‌బ్‌కు జైకొట్టాడు. రిష‌బ్ కూడా త‌న జ‌ట్టుకు దూకుడు నేర్పించాడు. తొలి ప‌ర్యాయంలోనే జ‌ట్టును టేబుల్ టాప‌ర్‌గా నిల‌బెట్టాడు. అయితే దుర‌దృష్టం కొద్దీ ప్లేఆఫ్స్ లోనే ఓడింది.
శ్రేయ‌స్ నొచ్చుకున్నాడా..!
శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయం నుంచి కోలుకుని తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చినా ఢిల్లీం టీం రిష‌బ్ పంత్‌నే కెప్టెన్‌గా కొన‌సాగించింది. దీనికి అయ్య‌ర్ నొచ్చుకున్న‌ట్లు తెలిసింది. ఇప్పుడు ఏకంగా త‌న‌కు ఆట‌గాడిగా కూడా అవ‌కాశం ఇవ్వ‌కుండా టీం ప‌క్క‌న‌పెట్టింది. పంత్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, పృథ్వీ షా, నార్జేల‌ను మాత్ర‌మే రిటైన్ చేసుకుంది. శ్రేయ‌స్‌తో పాటు ధావ‌న్‌, ర‌బాడ‌, అశ్విన్‌ల‌నూ ఢిల్లీ వ‌దులుకుంది. ఒక జ‌ట్టు కేవ‌లం న‌లుగురిని మాత్ర‌మే రిటైన్ చేసుకునే అవ‌కాశం ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. ఐపీఎల్లో శ్రేయ‌స్ భ‌విష్య‌త్ ఏమిటో.. కొత్త టీం ఏదైనా కెప్టెన్‌గా అవ‌కాశం ఇస్తుందో లేదో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.
త‌గ్గిన ప‌ర్స్ వాల్యూ..
మిగ‌తా జ‌ట్ల‌తో పోలిస్తే ఢిల్లీ టీం ప‌ర్స్ వాల్యూ కూడా త‌గ్గిపోయింది. చెన్నై రూ.48 కోట్లు, ముంబ‌యి రూ.48 కోట్లు, కోల్‌క‌తా రూ.48 కోట్లు, బెంగ‌ళూరు రూ.57 కోట్లు, రాజ‌స్థాన్ రూ.62 కోట్లు, స‌న్‌రైజ‌ర్స్ రూ.68 కోట్లు, పంజాబ్ రూ.72 కోట్ల ప‌ర్స్ వాల్యూని మిగుల్చుకున్నాయి. ఢిల్లీకి కేవ‌లం రూ.47.5 కోట్లు మాత్ర‌మే ఉన్నాయి. ఈ డ‌బ్బుల‌తో వేలంలో ఎవ‌రెవ‌రిని కొనుగోలు చేస్తుందో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: