38 ఏళ్ల రికార్డును భారత్ నిలబెట్టుకోగలదా...!

Podili Ravindranath
న్యూజీలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు సమాయత్తమైంది. మూడు మ్యాచ్‌లను గెలుచుకుని టీ 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు... టెస్టుల్లో కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. న్యూజీలాండ్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించాల్సి ఉంది. సౌతాఫ్రికా జట్టుతో మూడు టెస్టు మ్యాచుల్లో భారత్ తలపడనుంది. ఆ తర్వాత శ్రీలంక పర్యటనలో రెండు టెస్టులు ఆడాల్సింది. ఇలా ఫుల్ బిజీ షెడ్యూల్‌తో భారత క్రికెట్ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. కివీస్ జట్టుతో తొలి టెస్టు మ్యాచ్ నేటి నుంచి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ప్రారంభం కానుంది. కాన్పూర్‌లో ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు జరిగాయి. వీటిల్లో 7 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. మూడు మ్యాచుల్లో టీమిండియా ఓడిపోగా... మిగిలన 12 మ్యాచ్‌లు కూడా డ్రాగా ముగిశాయి. అయితే ఇదే కాన్పూర్ స్టేడియంలో చివరిగా న్యూజీలాండ్ జట్టుతోనే భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడింది. 2016లో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 216 పరుగుల తేడాదో ఘన విజయం సాధించింది.
కాన్పూర్ స్టేడియంలో భారత్ జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో 1952లో భారత్ - ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది.  ఆ మ్యాచ్‌లో భారత్ ఓడింది. 1983లో ప్రపంచ కప్ టోర్నీకి ముందు వెస్టిండీస్ జట్టుతో టీమిండియా కాన్పూర్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత నుంచి... ఇప్పటి వరకు కాన్పూర్‌ గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత జట్టు ఓడింది లేదు. అయితే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ జట్టు చేతిలో ఓడిన టిమిండియా... అందుకు బదులు తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అదే సమయంలో టీ 20 సిరీస్ ఓడిన కేన్ విలియమ్‌సన్ జట్టు కూడా కాన్పూర్‌ టెస్టులో గెలిచి... తామేమిటో భారత్‌కు రుచి చూపించాలని భావిస్తోంది. దీంతో 38 ఏళ్లుగా భారత్ పేరుతో ఉన్న విన్నింగ్ రికార్డును టీమిండియా నిలుపుకుంటుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని...  ఆ తర్వాత స్పిన్ వైపు తిరుగుతుందని పిచ్ క్యూరేటర్ వెల్లడించారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఉందన్నారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం మేలని కూడా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: