నేడే భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్..! రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు

N ANJANEYULU
మాములుగా క్రికెట్ మ్యాచ్ అంటే క్రీడాభిమానులు పండుగ చేసుకుంటారు.  అదే భార‌త్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులు టీవీకే అతుక్కుని ఉంటారు. అభిమానుల సంబ‌రాలు అంత  ఇంత కాదు. ఇక టీ-20 మ్యాచ్ అంటేనే ఇప్పుడు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. అందులో టీ-20 ప్ర‌పంచ క‌ప్ అంటే ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌నేది. బంతి బంతికి మ్యాచ్ ఎటువైపు మొగ్గు చూపుతుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. చివ‌రి బంతి వ‌ర‌కు ఏ జ‌ట్టు గెలుస్తుందో ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. క్ష‌ణం క్ష‌ణం టీ-20 మ్యాచ్‌లో అభిమానులు మ‌జాను ఆస్వాదిస్తుంటారు.  వీట‌న్నింటి మ‌ధ్య ఇవాళ టీమిండియా, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య టీ-20 ప్ర‌పంచ క‌ప్‌ మ్యాచ్.  
ఈ త‌రుణంలో క్రీడాభిమానుల‌తో పాటు బెట్టింగ్ రాయుళ్లు కూడ మంచి హుషారుగా క‌నిపిస్తున్నారు. మామూలుగానే దాయాది జ‌ట్లు అయిన భార‌త్‌-పాక్ మ‌ధ్య మ్యాచ్ ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగినా తీవ్ర ఉత్కంఠ నెల‌కొని ఉంటుంది. అందులో ఇవాళ సాయంత్రం 7.30 గంట‌ల‌కు జ‌రిగే మ్యాచ్‌పై క్రీడాభిమానులు భారీ అంచెనాలు పెట్టుకున్నారు.  పందెం రాయుళ్లు ఇప్ప‌టి నుంచే పందాలు కాస్తున్నారు. దాదాపు రెండేండ్ల త‌రువాత ఇరుజ‌ట్లు పోటాపోటీగా త‌ల‌ప‌డుతున్న త‌రుణంలో జోరుగా కొన‌సాగనున్నాయి. ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా  జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన  ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్ లో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోయారు.
టీ-20 మ్యాచ్‌ల‌ను ఆస‌రాగా చేసుకొని బెట్టింగ్ నిర్వాహ‌కులు ఆన్‌లైన్‌లో రెచ్చిపోతున్నారు. సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి ప్ర‌త్యేక యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నారు. అడ్వాన్స్ టెక్నాల‌జీ ద్వారా గూగుల్‌పే, ఫోన్ పేల‌లో  పేమెంట్ చేస్తూ  బాల్ టూ బాల్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. గ‌తంలో ఢిల్లీ, రాజ‌స్థాన్‌, చెన్నై, బెంగ‌ళూరు కు చెందిన బెట్టింగ్ నిర్వాహ‌కులు ఆయా న‌గ‌రాల్లో రూముల‌ను అద్దెకు తీసుకొని బెట్టింగ్ చేప‌ట్టేవారు. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప‌ట్ట‌ణాల నుంచి ప‌ల్లెదాక బెట్టింగ్ విస్త‌రించింది. ఇప్ప‌టికే కొంత మంది బెట్టింగులు నిర్వ‌హిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ముఠాల ఆట క‌ట్టించ‌డానికి సైబ‌ర్ సెల్ లు ప‌ని చేస్తున్నాయ‌ని ఆయా క‌మిష‌న‌ర్లు వెల్ల‌డిస్తున్నారు.
ఐపీ అడ్ర‌స్ ఆధారంగా బెట్టింగ్ నిర్వాహ‌కులను పోలీసులు గుర్తించ‌డం ద్వారా బెట్టింగ్ రాయుళ్లు ఒక‌డుగు ముందుకేసి పందాలు కొనసాగిస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల ఐపీ అడ్ర‌స్‌ల‌తో బెట్టింగ్ అప్లికేష‌న్‌ల‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఐపీ అడ్ర‌స్‌ను గుర్తించి పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టినా ఎవ‌రూ దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. కొంత మంది యువ‌త తొలుత బెట్టింగ్‌లో డ‌బ్బులు సంపాదిస్తారు. ఆ ఆశ‌కు ఆస్తుల‌ను సైతం అమ్ముకొని త‌న జీవితాల‌ను నాశ‌నం చేసుకున్న ఘ‌ట‌న‌లు ఎన్నో చోటు చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: