శార్దూల్ ఇన్.. అక్షర్ ఔట్.. టీ20 వరల్డ్ కప్ టీమ్..!

Podili Ravindranath
మరో వారం రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2021 క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ ముగిసిన వెంటనే... టీ20 ప్రపంచ కప్ టోర్నీ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే ప్లేయర్స్ రెడీ అవుతున్నారు. ఈ నెల 24వ తేదీన హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్ - పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం ప్లేయర్స్ ఎంపిక కూడా పూర్తి చేసింది ఇండియన్ క్రికెట్ బోర్డు. అయితే సరిగ్గా వారం రోజుల ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 15 మందితో టీమ్ ప్లేయర్స్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది బీసీసీఐ. అయితే ఇప్పుడు జట్టులోకి కొత్తగా ఎవరినీ తీసుకోకపోయినప్పటికీ... సెలక్ట్ చేసిన 15 మందిలోనే మార్పులు చేర్పులు చేసింది భారత జట్టు. స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న శార్ధుల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు టీమ్‌లోనే ఉన్న అక్షర్ పటేల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌ జాబితాలో చేర్చింది జట్టు మేనేజ్‌మెంట్.
టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ కోసం ఐసీసీ రూపొందించిన జాబితాలో భాగంగా... మరో 8 మంది ఆటగాళ్లను యూఏఈలోనే బయో బబుల్‌లో ఉంచారు అధికారులు. టీమిండియా జట్టుకు అందుబాటులో ఉండే విధంగా... మొత్తం 15 మంది జట్టు సభ్యులతో పాటు మరో 8 మంది ప్లేయర్స్‌ను కూడా బయో బబుల్‌లోనే ఉంచింది భారత జట్టు మేనేజ్‌మెంట్. వీరంతా కూడా టోర్నీ ముగిసే వరకు దుబాయ్‌లోనే బయో బబుల్‌లో జట్టుకు అందుబాటులో ఉంటారు. 8 మంది జాబితాలో ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ తరఫున ఆడుతున్నఅవేష్ ఖాన్, సన్ రైజర్స్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్, బెంగళూర్ క్రికెటర్స్ హర్షల్ పటేల్, మేరీవాలా, వెంకటేష్ అయ్యర్, కరణ్ శర్మ, కృష్ణప్ప గౌతమ్, షాబాజ్ అహ్మద్ ఉన్నారు. వీరంతా కూడా టీమిండియా జట్టుతో పాటే యూఏఈలోని బయో బబుల్‌లో ఉంటారు. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న హార్థిక్ పాండ్యాపై వేటు పడుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అక్షర్ పటేల్‌ను జట్టు పక్కన పెట్టింది. ఇక భువనేశ్వర్ కుమార్ గురించి కూడా ప్రస్తావించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: