చరిత్రకు అడుగు దూరంలో జకోవిచ్..!

Podili Ravindranath
టెన్నిస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్. యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో నోవాక్ ఫైనల్ చేరాడు. హోరా హోరీగా సాగిన గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నోవాక్ ఫైనల్‌లో కాలు పెట్టాడు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అలెగ్జాండర్ జ్వెరెన్‌తో తలపడిన జకోవిచ్‌.. ఐదు సెట్ల పాటు పోరాడి విజయం సాధించాడు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా జకోవిచ్ విజయం సాధిస్తే... ఈ క్యాలెండర్ ఈయర్‌లో గ్రాండ్ స్లామ్ సాధించిన ఆటగాడిగా రికార్డు కెక్కుతాడు. తొలి సెట్‌ను 4-6 తేడాతో ఓడిన జకోవిచ్... ఆ తర్వాత తమ మార్క్ ఆటతీరు ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కోర్టులో చెలరేగాడు. మూడు బ్రేక్ పాయింట్లు సాధించిన ఈ సెర్బియన్... 6-2తో రెండో సెట్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత సెట్‌లో కూడా జకోవిచ్ జోరు కొనసాగింది. బలమైన సర్వీసులతో రెండు వరుస బ్రేక్ పాయింట్లు సాధించి... 6-4తో మూడో సెట్ సొంతం చేసుకున్నాడు.
ఇదే జోరులో తర్వాత సెట్ కూడా గెలుస్తాడనుకున్న నోవాక్ అభిమానుల ఆశలపై జ్వెరెన్ నీళ్లు జల్లాడు. నాలుగో సెట్‌లో పుంజుకున్న జ్వెరెన్... జకోవిచ్ జోరుకు బ్రేక్ వేశాడు. సర్వీస్ బ్రేక్ చేస్తూ... అవకాశం వచ్చినప్పుడల్లా నోవాక్‌ను కోర్టులో పరుగులు పెట్టించాడు. 10 పాయింట్ల పాటు జరిగిన నాలుగో సెట్‌ను 6-4 తేడాతో జ్వెరెన్ గెలుచుకున్నాడు. ఐదు సెట్లలో చెరో రెండు సెట్లు గెలవడంతో... నిర్ణయాత్మకమైన చివరి సెట్ హోరా హోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ ప్రత్యర్థి జోరుకు కళ్లెం వేసిన సెర్బియన్ టాప్ స్టార్... తమదైన ఆటతీరుతో చెలరేగాడు. ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా టాప్ క్లాస్ ఆటతో జ్వెరెన్‌కు ముచ్చెమటలు పట్టేలా చేసి 6-2 తేడాతో సునాయాసంగా ఐదో సెట్ గెలుచుకుని ఫైనల్ చేరాడు జకోవిచ్. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్... కెనడా ప్లేయర్‌పై 6-4, 7-5, 6-2 తేడాతో గెలిచి ఫైనల్ చేరాడు.
ఈ ఏడాది ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్న జకోవిచ్... ఈ సీజన్ చివరిదైన యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా గెలుచుకుంటే.. క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. 1969లో లాడా రావర్ అనే ప్లేయర్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను జకోవిచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అటు మోకాలి గాయం కారణంగా స్పెయిన్ బుల్ రఫెల్ నాదర్ ప్రస్తుత యూఎస్ ఓపెన్ టోర్నీకి దూరంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: