ఆల్ రౌండ్ ప్రతిభతో రాణించిన టీమిండియా..!

Podili Ravindranath
ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం సధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇక చివరి టెస్టు మ్యాచ్ గెలిచినా, డ్రా గా ముగించిన సరే.. సిరీస్ కోహ్లీ సేన వశమవుతుంది. ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఆతిధ్య ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన కోహ్లీ సేన... ఓవల్ టెస్టులో అందుకు బదులు తీర్చుకుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీకి తోడు.... భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఓవల్ టెస్టులో సూపర్ విక్టరీ సాధించింది భారత జట్టు.
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 191 పరుగులకే ఆలౌటైన టీమిండియా... క్రికెట్ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో ప్రత్యర్థి జట్టు దూకుడు కళ్లెం వేయడంలో బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. పోప్ 81 రన్స్ చేయగా.. చివర్లో వోక్స్ కూడా 50 రన్స్ చేసి జట్టుకు వంద పరుగుల ఆధిక్యం అందించారు. అయితే విమర్శలకు చెక్ పెట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్... తమ బ్యాట్ తోనే సమాధానం ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 466 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. ప్రత్యర్థి ముందు 368 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు... భారత బౌలర్లును ఎదుర్కొవడంలో తీవ్ర ఇబ్బందులు పడింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు వంద పరుగులు జోడించారు. బర్న్స్ 50 రన్స్ చేయగా... హమీద్ 63 పరుగులు చేశాడు. టార్గెట్ దిశగా వెళ్తున్న ఇంగ్లండ్ జట్టును ఠాకూర్ బ్రేక్ చేశాడు. బర్న్స్ ను అవుట్ చేయడంతో ఇంగ్లీష్ టీమ్ వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ 5 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. ఇక సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రూట్ కేవలం 36 రన్స్ మాత్రమే చేయడంతో టీమిండియాలో ఆశలు రేకెత్తాయి. ఆ తర్వాత వచ్చిన వారిలో వోక్స్ మినహా మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా వెళ్లిన వారే. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ టీమ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోడంతో... 210 రన్స్‌కే ఆలౌటైంది. భారత్ 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించి... సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. సెంచరీతో సత్తా చాటిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరిస్‌లో చివరి టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: