ఏనుగు ముఖం వాడే .. జ్ఞాన ప్రదాత .. తొలిపూజ అందుకే ..

గణేషుని ఆవిర్భావం అందరిలా జరిగింది కాదు. అంటే సాధారణంగా తల్లిగర్భం నుండి కాకుండా తల్లిసంకల్పం నుండి రూపుదిద్దుకొని, గణాలకు అధిపతి అయ్యాడు. ఈయన తల్లిదండ్రలు స్వయంగా పార్వతీపరమేశ్వరులే. మాత ఒకసారి తనకు కుమారుడు ఉంటె ఎలా ఉండబోతాడు అని సంకల్పించి, పసుపు ముద్దతో ఒక రూపాన్ని తయారుచేసింది. స్వయంగా విశ్వానికి మాతృమూర్తి కాబట్టి ప్రాణం కూడా పోసింది. తన బిడ్డను చూసి మురిసిపోయింది. అటు తరువాత కాసేపటికి స్నానానికి వెళుతూ, బిడ్డని తలుపు వద్ద కాపలా ఉండమని, ఎవరిని లోనకు రాకుండా చూసుకోవాలి అని చెప్తుంది. ఆ మాట శిరోధార్యంగా తీసుకున్న గణపతి కాపలా కాస్తూ ఉంటాడు.
అప్పుడే బయటకు వెళ్లిన శివుడు తిరిగి వస్తాడు. లోనికి వెల్లబోయిన ఆయనను గణేషుడు ఆగండి, అనుమతి లేకుండా అలా లోనికి వెళ్ళరాదు, మా తల్లిగారు స్నానం చేస్తున్నారు అని చెపుతాడు. శివుడు నవ్వి నేనెవరో తెలుసా .. అంటాడు. మీరు ఎవరైనా సరే లోనికి ఎవ్వరిని అనుమతించరాదని మా తల్లిగారి ఆజ్ఞ, అది పాటించడం నా కర్తవ్యం అంటాడు. అదివిన్న శివుడికి కోపం వస్తుంది, ఒక్కసారిగా ఖడ్గం తీసుకోని శిరస్సు ఖండించి వేస్తాడు. అప్పుడు బాధతో తల్లీ అని గణేషుడు అరుస్తాడు. అంతట ఉరుకులు పరుగుల మీద పార్వతీమాత బయటకు వస్తుంది, బిడ్డ తల వేరై ఉండటాన్ని చూసి బాధతో శివుడికి జరిగింది చెప్తుంది.
అది విన్న శివుడు, తన గణాలను నలుదిక్కులకు పంపి ఉత్తర దిక్కున పడుకున్న జంతువు తలను(అందుకే ఉత్తరం తల పెట్టి నిద్రపోరాదు అని ఇప్పటికి పెద్దలు చెప్తుంటారు) తీసుకురావాలని ఆదేశిస్తాడు. శివగణాలు ఒక ఏనుగు తలను తీసుకువస్తారు. పార్వతీ మాత అది చూసి, నా బిడ్డకు ఈ తల ఎలా .. అని శివుడిని ప్రశ్నిస్తుంది. సందేహాలు వీడి తలను గణేశుడి శరీరానికి అతికించాలని శివుడు చెప్తాడు. అప్పుడు శివుడు మాతతో ఇలా అంటారు, దేవి ఏనుగు అంటే జ్ఞానానికి ప్రతిరూపం, ఇక రూపం విషయానికి వస్తే, గణేషుణ్ని ఎవరు ఏ విధంగా చూడాలి అనుకుంటే అలా కనిపిస్తాడు అని శివుడు వరం ప్రసాదిస్తున్నాను అని చెప్పి వారిస్తారు. అప్పటి నుండి మాతకు మాత్రం గణేషుడు పూర్వరూపంలోనే కనిపిస్తూ వచ్చారు. ఏనుగు తల ఉన్నవాడు కాబట్టి, గణేషుడు జ్ఞానకారుడుగా పిలవబడ్డాడు. అంతటితో ఆగక, శివుడు గణేషుని గణాలకు అధిపతిగా ప్రకటించాడు. అంటే ఎవరైనా గణేషుని పూజించిన తరువాతే ఏ పనైనా చేయాల్సి ఉంటుంది, తద్వారా ఆయా పనులు ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతాయి. అప్పటి నుండి మొదటి పూజ గణనాథుడికే.
ఇంత చెప్పిన శివుడు, తాను స్వయంగా పాటించకపోతే లోకం ఎలా పాటిస్తుంది అనే ఆలోచనతో మరో నాటకం తెరపైకి తెచ్చాడు. తానుగా ఒక పని చేయాలని సంకల్పించాడు శివుడు. కానీ, గణేషుడికి తొలిపూజ చేయకుండానే పని ప్రారంభించాడు శివుడు. దానితో మొదటి దశలోనే ఆ పనిలో ఆటంకాలు రాసాగాయి. అప్పుడు తాను గణేషుడికి ఇచ్చిన వరం గుర్తు చేసుకొని, నేను తొలిపూజ గణేషునికి చేయనందుకు ఈ ఆటంకాలు అని తెలుసుకున్నారు. అంతట వెంటనే తొలిపూజ గణేషుడికి చేసి, అనంతరం తిరిగి పని ప్రారంభించాడు, విజయవంతంగా పూరించాడు. ఇది శివుడు లోకానికి చెప్పిన పాఠం. ఎవరికైనా వారివారి పనులలో ఆటంకాలు వస్తుంటే, వెంటనే గణేషునికి పూజ చేసి, వారి ఆటంకాలను తొలగించుకునేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: