తిరుమలలో రూమ్ ఇప్పుడు చాలా ఈజీ..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి ప్రధాన సమస్య కేవలం వసతి మాత్రమే. ప్రస్తుతం దర్శనం అంతా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్న స్వామి వారి భక్తులు... రూమ్ కోసం మాత్రం పడిగాపులు కాయాల్సి వస్తుంది. తెల్లవారుజామునే కారుల్లో, బస్సుల్లో కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు... వారిని అలా రోడ్డుపైన నిలబెట్టి... రూమ్ కోసం క్యూ లైన్ లోకి వెళ్లి గంటల పాటు నిలుచుని... చివరికి తన వంతు వచ్చే సరికి నో రూమ్ బోర్డు కనిపిస్తే... ఆ బాధ వేరు. ఎప్పటికో వసతి దొరుకుతుంది. ఈ విధానంపై ఎప్పటి నుంచో టీటీడీకి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అయితే భక్తుల కష్టాలను గుర్తించిన టీటీడీ అధికారులు వసతి గదుల వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో మొత్తం ఆరు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదులు పొందేలా భక్తులకు  అవకాశం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయం వద్ద కొత్తగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కేవలం సీఆర్ఓ కార్యాలయం వద్ద మాత్రమే వసతి గదుల బుకింగ్ సౌకర్యం ఉంది. గదుల కోసం వచ్చే వారు సీఆర్ఓ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కేటాయింపు చేసేవారు. ఇక్కడ రద్దీ అధికంగా ఉండేది. అలాగే కార్యాలయం బయట పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల అక్కడికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి చెక్ పెట్టేలా ఇప్పుడు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. సీఆర్ఓ వద్ద రెండు కౌంటర్లు, బాలాజీ మెయిన్ బస్టాండ్ వద్ద మరో రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిధి భవనం వద్ద ఉన్న పార్కింగ్ ప్లేస్ లో రెండు కౌంటర్లు, రాంభగీచ బస్టాండ్ దగ్గర రెండు కౌంటర్లు, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు దగ్గర రెండు కౌంటర్లు, జీఎన్సీ టోల్ గేట్ దగ్గర ఉన్న లగేజ్ కౌంటర్ దగ్గర రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకున్న వారికి... వసతి గదుల సమాచారం మెసేజ్ రూపంలో వస్తుంది. గదులు కేటాయించిన ప్రాంతాల్లో ఉన్న ఉప విచారణ కార్యాలయాల దగ్గర తగిన రుసుం చెల్లించి గదులు పొందేలా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో కేవలం సీఆర్ఓ కార్యాలయం వద్దే ఉన్న కౌంటర్లను... ఇప్పుడు మొత్తం 12 చోట్ల ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కౌంటర్ దగ్గర గదుల వివరాలు తెలియజేసేలా డిస్ ప్లే ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: