శ్రీకృష్ణుడు "లడ్డు గోపాల్" ఎలా అయ్యాడో తెలుసా ?

Vimalatha
ఈరోజు కృష్ణాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజున కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి గా జరుపుకుంటారు. అయితే కృష్ణుని శ్యామ్, మోహన్, లడ్డు గోపాల్, కన్నయ్య వంటి పేర్లతో పిలుస్తుంటారు. అయితే ఇందులో 'లడ్డు గోపాల్' పేరు చాలా ఫేమస్. దాని వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది.
శ్రీ కృష్ణుడికి గొప్ప భక్తుడు కుంభందాస్. ఆయన ఎప్పుడూ శ్రీకృష్ణుని భక్తిలో మునిగిపోయి పూర్తి నియమ నిబంధనలతో భక్తిశ్రద్ధలతో భగవంతుని సేవిస్తూ ఉండేవాడు. కృష్ణుడికి సేవలో ఎలాంటి ఆటంకం కలగకుండా అనే ఉద్దేశంతో అతను ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. కానీ ఒకరోజు అనుకోకుండా భగవత్ కథ చెప్పమని బృందావనం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో దేవుడికి సేవచేసే బాధ్యతను కుమారుడికి అప్పగించాడు. కుంభం దాస్ కుమారుడు రఘునందన్ కు అన్ని నియమ నిబంధనలు, జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు.
రఘునందన్ తండ్రి వెళ్ళాక కృష్ణుడు ముందు ప్రసాదాన్ని ఉంచి తినమని అభ్యర్థించాడు. కానీ కృష్ణుడి విగ్రహం తినలేదు. దీంతో రఘు నందన్ బాధపడ్డాడు. తినమని అభ్యర్థిస్తూ ఏడుస్తున్నాడు. ఆ పిల్లాడి బాధ చూడలేక కృష్ణుడు చిన్న పిల్లాడి రూపం ధరించి తినడానికి కూర్చున్నాడు. రఘునందన్ చాలా సంతోషించాడు. అయితే తిరిగొచ్చిన తండ్రి ప్రసాదం ఎక్కడ అని అడిగాడు. ఆ పిల్లడు కృష్ణుడే తిన్నాడని చెప్పాడు.
రోజు ఇదే కథ జరుగుతుండడంతో కుంభందాస్ కి తన కుమారుడు ప్రసాదం తినేస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. దీంతో ఒకరోజు కుంభందాస్ లడ్డూలను తయారు చేసి ప్లేట్లో అలంకరించి దేవుడికి సమర్పించమని చెప్పి చాటుగా ఉండి ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు.
రఘునందన్ ప్రసాదాన్ని పెట్టడం, కృష్ణుడు వచ్చి చిన్న పిల్లాడి రూపంలో ప్రసాదాన్ని తింటూ ఉండటం చూసి కుంభందాస్ కదిలిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చి భగవంతుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. కానీ అదే సమయంలో కృష్ణుడు ఒక చేతిలో లడ్డూ పట్టుకొని మరో చేతితో లడ్డూ తింటూ ఉన్నాడు. దీంతో ఆయన అక్కడే అలాగే శిలగా మారిపోయాడు. అప్పట్నుంచి శ్రీకృష్ణుని "లడ్డు గోపాల్" గా కూడా కొలుస్తారు భక్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: