"వరలక్ష్మి వ్రతం" ఎందుకు చేయాలో తెలుసా ?

Vimalatha
దక్షిణ భారతదేశంలో "వరలక్ష్మీ" వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం "వరలక్ష్మీ" వ్రతం చేస్తారు. శ్రద్ధ, భక్తులతో చేసే ఈ వ్రతం వల్ల జరిగే అద్భుతాలను తెలుసుకున్న తరువాత ఉత్తరాది వారు కూడా చాలా మంది శ్రావణ శుక్రవారం ఉపవాసం చేయడం ప్రారంభించారు. ఈసారి 2021 ఆగస్టు 20న "వరలక్ష్మీ" వ్రతం వచ్చింది. ఈ రోజు ఉపవాసం ఉంటూ భక్తితో పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా అష్ట లక్ష్మి ఆశీర్వాదాలు లభిస్తాయి. పేదరికం తొలగిపోతుందని, తరతరాలు సంతోషంగా గడుపుతారని నమ్ముతారు. సంతానం లేని దంపతులకు పిల్లలు పుడతారని అంటారు. అయితే ఈ ఉపవాసం పెళ్లి కాని అమ్మాయిల కోసం కాదు వివాహిత మహిళలు మాత్రమే దీనిని పాటించాలి. భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ ఉపవాసాన్ని పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయని అంటారు.
ఈ ఉపవాసానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. మగధ దేశంలో కుండి అనే నగరం ఉండేది. చారుమతి అనే పేద మహిళ ఈ నగరంలో నివసించేది. చారుమతి లక్ష్మీదేవికి గొప్ప భక్తురాలు. ఆమె ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవి కోసం ఉపవాసం ఉండేది. భక్తిశ్రద్ధలతో పూజించేది. ఒకసారి లక్ష్మి దేవి చారుమతి కలలోకి వచ్చి శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్ష్మి ఉపవాసం ఉంటూ పూజ చేయమని చెప్పింది. ఆ తల్లి ఆజ్ఞలను పాటిస్తూ చారుమతి ఉపవాసం ఉంటుంది. లక్ష్మీదేవి కలలో చెప్పిన నియమాల ప్రకారం పూజించింది. చారుమతి పూజ పూర్తయిన వెంటనే ఆమె శరీరం బంగారు ఆభరణాలతో నిండిపోయింది. ఇల్లు ఆహార ధాన్యాలతో నిండిపోయింది. ఈ విషయం తెలిసిన ఇతర మహిళలు కూడా ఈ ఉపవాసం ఉంటూ లక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం నాడు పూజించడం ప్రారంభించారు. ఆ తరువాత దేశం మొత్తం సిరిసంపదలతో తులతూగింది. లక్ష్మీదేవి అడిగిన భక్తులు అందరికీ వరాలిచ్చింది కాబట్టి అప్పటి నుండి ఈ ఉపవాసం "వరలక్ష్మీ వ్రతం"గా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం మహిళలు ఈ ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: