గృహస్థు ఆచరించాల్సిన సంస్కారాలు గృహ్య సూత్రాలు

VAMSI
గృహ్య సూత్రాలనేవి మానవుని జీవితంలో చాలా ముఖ్యమైనవిగా పురాణాలు వేదాలలో చెప్పబడినవి. ఇవి ప్రధానముగా గృహస్థులు ఆచరించాల్సిన ధర్మాలనూ, సంస్కారాలనూ వివరిస్తాయి. ఇవి ఇంట్లో చేయవలసిన కర్మలు. ఇవి వాటిని రచించిన ఋషులపేర్లమీద ప్రాచుర్యం పొందాయి. వీటిలో బోధాయన, ఆపస్తంభ, కాత్యాయనమొదలగు తొమ్మిది గృహ్యసూత్రాలు ప్రాచీనమైనవి. వైఖానస, శౌనకీయ, భారద్వాజ, అగ్నివేశ, జైమినీయ, వాధూల, మాధ్యందిన, కౌండిన్య, కౌశీతకీ గృహ్యసూత్రాలు తొమ్మిది ఆ తరువాతి కాలానివి.  
గృహ్యసూత్రాలు, నలభై సంస్కారాలను, ఎనిమిది ఆత్మ గుణాలను నిర్దేశించాయి. వైదికులు, ప్రతినిత్యం ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు, ఏడు పాకయజ్ఞాలు మొత్తం కలిపి ఇరవై ఒక్క యజ్ఞాలను ఆచరించే అగ్నికార్యం చేయాలని కల్పసూత్రాలు చెప్తున్నాయి. అసలు ఈ సంస్కారాల సంఖ్యమీద కొన్ని వాదోపవాదాలున్నాయి. స్వామి దయానంద సరస్వతి రచించిన ‘సంస్కార విధి’ లో పదహారు సంస్కారాలనే పేర్కొన్నారు. అవి గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణం, అన్నప్రాసనం, చూడాకరణ, కర్ణవేధ, విద్యారంభం, ఉపనయనం, వేదారంభం, కేశాంతం, సమావర్తనం, వివాహం, అంత్యేష్టి.
గర్భాదానం, పుంసవనం, సీమంతం అనేవి తన భార్యకు చేయవల్సిన మూడు సంస్కారాలు. జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలం, ఉపనయనం అనేవి తనసంతానం శ్రేయస్సు కోసం చేయవల్సిన ఐదుసంస్కారాలు. మొత్తం కలిపి గృహస్థుడు ఆచరించాల్సినవి నలభైసంస్కారాలు. వీటి గురించి, పారస్కరుడు, అశ్వలాయనుడు, బోధాయనుడు మాత్రమే తమ గృహ్య సూత్రాలలో వివరంగా తెలియజేశారు. ఈ గృహ్య సూత్రాలలో ముఖ్యంగా, గార్హపత్యాగ్నిని ఉపయోగించిచేసే  క్రతువుల వివరణ వుంటుంది.
ఈ సంస్కారాల సంఖ్య విషయంలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, అన్ని సంస్కారాలూ మనిషిని సంస్కరించేవే, తనని ధర్మమార్గాన ప్రయాణింప జేసేవే. ఈ సంస్కారాలన్నీ కొన్ని స్వప్రయోజనాలకోసం చేసేవైతే, కొన్ని ఇతరుల లేక సామాజిక ప్రయోజనాలకోసం చేసేవి. ఒక వ్యక్తి సంస్కారవంతుడైతే, అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజానికి ఉపయోగించేదే. కాబట్టే, మనిషి ఈ ధర్మాలను ఆచరించినంత కాలం సమాజం సంస్కారవంతంగా, ధర్మబద్ధంగా వుంటుంది. వ్యక్తులు ధర్మం తప్పితే, వ్యవస్థ కూడా గాడితప్పి యావత్‌ సమాజమూ భ్రష్టుపట్టిపోతుంది. ధర్మానికి హాని జరిగితే, సాక్షాత్తూ భగవంతుడే వచ్చి ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పడంలో, ధర్మానికివున్న ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గుర్తించి నడచుకోవాలి. ధర్మ హాని జరుగకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: