టాలీవుడ్ లో ధర్మవరపు కితకితలు ప్రత్యేకం

Vimalatha
తెలుగు తెరపై ఆయన కనిపించారంటే పెదాలపై చిరునవ్వు ప్రత్యక్షమయ్యేవి. ఆయన రూపం చూసినా, ప్రత్యేక శైలిలో ఆయన చెప్పే డైలాగులు విన్నా నవ్వాగదు. ఆయనే టాలీవుడ్ టాప్ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. తెలుగు తెరపై నవ్వులు పూయించి తనదైన శైలిలో ప్రత్యేకత చాటుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
1954 సెప్టెంబర్ 20న ధర్మవరం సుబ్రహ్మణ్యం జన్మించారు. ప్రకాశం జిల్లాలోని కొమ్మునేని వారి పాలెం అనే గ్రామంలో సుబ్రహ్మణ్యం పుట్టారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటి నుంచే ఆయన నాటకాలు వేస్తూ వాటికి దర్శకత్వం వహించడంతో సినిమాల పై తనకున్న మక్కువను ప్రదర్శించేవారు. ఆయన ప్రత్యేక శైలి కి ఫిదా అయిన జనాలు ధర్మవరపు సుబ్రహ్మణ్యం పేరును మారు మ్రోగించారు. దీంతో జంధ్యాల తన సినిమా 'జయమ్ము నిశ్చయమ్మురా' లో ఆయనకు అవకాశం కల్పించారు.
అప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ధర్మవరపు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో వివిధ చిత్రాలలో నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న అగ్రశ్రేణి ప్రముఖ హాస్యనటులలో ఒకరిగా ధర్మవరపు నిలిచారు.
కమెడియన్ గా ఆయన చేసిన పాత్రలు తెలుగు చిత్రసీమలో ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆయనకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డులు కూడా లభించాయి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘం అధ్యక్షునిగా పని చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అభిమాని. శోభన్ బాబు రింగ్ అంటూ నుదుటిపై జుట్టుతో రింగ్ తో కదలాడే ఆయన నిలువెత్తు రూపం ఇప్పటికీ తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్రలా ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: