భారతదేశంలో మేధావుల సంఘానికి అధ్యక్షుడు.. ఉండవల్లి అరుణ్‌కుమార్

Garikapati Rajesh
ఉండవల్లి అరుణ్‌కుమార్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. మంచి వాక్చాతుర్యం, భాష అనువాదకుడిగా, తెలివిగలవాడిగా, మేధావిగా పిలిపించుకుంటుంటారు. ఆయన ఏది మాట్లాడినా అందులో లాజిక్కు ఉంటుందని, ఎవరిమీదైనా నెపం మోపినా ఎదుటివారు ఉండవల్లిని ఏమీ అనలేని రీతిలో ఉంటుందని అంటుంటారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి జగన్పై చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే మరోసారి ఆయన మేధావి అని ఒప్పుకోవాల్సిందే!
వైజాగ్ డిక్లరేషన్
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై మాట్లాడిన ఉండవల్లి అరుణ్‌కుమార్ ముఖ్యమంత్రి జగన్రెడ్డిని ఏమీ అనకుండానే కడిగిపారేశారు. నిలదీయకుండానే తెలివిగా నిలదీశారు. ఎంతైనా ఆయన మేధావికదా!!.  ఏమీ ఎరగనట్లుగా, ప్రజలు అనుకుంటున్నారంటూ ఆయన అనాల్సివన్నీ అనేశారు. కాకలు తీరిన మేధావులంతా ఇంతే. తాజాగా ఆయన వైజాగ్ డిక్లరేషన్ అంటూ కొత్తపదం తెరమీదకు తెచ్చారు. విశాఖలో జగన్ నాయకత్వంలో సదస్సు పెట్టాలని, కేంద్రాన్ని ఎదురించాలని సూచించారు. అవన్నీ జరగవని ఆయనకు తెలియదా?
అన్నీ ఆయన అన్నారు..
వైఎస్ జగన్మోహన్రెడ్డీ .. భయపడమాకు... వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా నీకు ఇది తగని పని... ఇప్పటికే నీమీద అవినీతి కేసులుండటంవల్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాకు భయపడుతున్నావని నీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు... కేవలం అవినీతివల్లే నువ్వు కేంద్రంతో పోరాడలేకపోతున్నావంటూ చెబుతున్నారు... అంటూ ఆయనే అనాల్సినవన్నీ అనేశారు. అంతేకాదు ముఖ్యమంత్రిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నీమీద అవినీతి కేసులుండటంవల్లే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై వెనకడుగు వేస్తున్నావంటూ తాను అనకుండా ప్రత్యర్థులు అంటున్నారంటూ నెపం ప్రతిపక్షాలపై వేశారు.
జైలుకెళితే ఏమవుతుందంట?
మహా అయితే ఏమవుతుంది.. జైలుకు వెళ్తాం.. జైలేమైనా నీకు కొత్తా? అన్నారు. వాస్తవమే.. జగన్రెడ్డికి జైలు కొత్త కాదని, 16 నెలలు జైలులో ఉండి బెయిల్పై ఉన్నాడని పరోక్షంగా చెప్పారు. ప్రజలవెంట నిలుస్తావా?  మోడీవెంట నిలుస్తావా? అంటూ బంతిని జగన్ కోర్టులోకే నెట్టారు. 151 సీట్లిచ్చారు.. నువ్వు ఇలాగే ఉంటే మళ్లీ ప్రజలకు నీకు ఓటేయరు?  నువు అధికారంలోకి రాలేవు అంటూ జరగబోయేది కూడా పరోక్షంగా చెప్పారు. ఒక చిన్న విలేకరుల సమావేశంలో ఒక ముఖ్యమంత్రిపై నేరుగా అనకుండా, ఇతరులు అంటున్నారంటూ ఆయన అనలేనివి కూడా అంటూ సమావేశాన్ని ముగించడం ఉండవల్లిలోని మేధావి తనాన్ని మనకు తెలియపరచడంలేదూ!!. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ఉండవల్లిని చూసి తమ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: