హెరాల్డ్ సెటైర్ : సచివాలయం ఉద్యోగులకు డ్రెస్ కోడా ?

Vijaya
అవును మీరు చదవింది కరెక్టే.  స్కూళ్ళల్లో విద్యార్ధులకు యూనీఫారం ఉన్నట్లు, త్రివిధ దళాలు, కొన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు యూనిఫారం ఉన్నట్లే సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా యూనీఫారం పెట్టి డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకోసం ఇప్పటికే రకరకాల డ్రస్ కలర్లను చూసింది. ఇందుకోసం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయాలని కూడా డిసైడ్ అయ్యింది. ఇక్కడ సచివాలయం ఉద్యోగులకు డ్రస్ కోడ్ అంటే అమరావతిలోని సచివాలయం (సెక్రటేరియట్) ఉద్యోగులు కాదు. అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్ధ ఉద్యోగులకన్నమాట. 13  జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో  179 వార్డు సచివాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో  884 గ్రామ సచివాలయాలను  ప్రారంభించిన విషయం తెలిసిందే.



ఈ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో అనేక క్యాడర్లున్నాయి. ప్రతి క్యాడర్ కార్యదర్శికి, ఉద్యోగులకు ఒక్కో డ్రెస్ కోడ్ అమలు చేయటం వల్ల జనాలు సులభంగా వారిని గుర్తించవచ్చని ప్రభుత్వ పెద్దలు ఆలోచించారు. ఇప్పటికే వారి క్యాడర్ ప్రకారం అందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులను అందించింది. అయినా కానీండి ప్రతి క్యాడర్ కు ఒక్కో సేవ అందించే ఒక్కో కార్యదర్శి+సిబ్బందికి వేర్వేరు డ్రస్ కోడ్ అమలు చేస్తే జనాలకు మరింత సౌలభ్యంగా ఉంటుందనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. ఉద్యోగుల్లో మగవాళ్ళకు స్కై బ్లూ కలర్ షర్టు, బిస్కెట్ కలర్ ప్యాంటును ఎంపిక చేశారు. అలాగే మహిళా ఉద్యోగులకు స్కై బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగ్గిన్ కలర్ ను ఎంపిక చేశారు. ముందే చెప్పుకున్నట్లుగా ఇది కేవలం ప్రయోగాత్మకం మాత్రమే. పై రంగుల్లోని డ్రస్సులను ఎంపిక చేసిన సచివాలయాల్లోని ఉద్యోగులకు ఇచ్చి జనాభిప్రాయం సేకరిస్తారు. దాని ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైతే డ్రస్ కలర్లలో మార్పులు చేయాలని ప్రభుత్వం అనుకున్నది.



ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద ఇప్పటికే మిశ్రమ స్పందన మొదలైపోయింది. అసలు వార్డు, గ్రామసచివాలయాల ఉద్యోగులకు డ్రస్ కోడ్ అవసరమా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే తమకు అవసరమైన  ఉద్యోగిని జనాలు డ్రస్సును బట్టి గుర్తించరు. రెవిన్యు ఆఫీసుకో లేకపోతే పోలీసు స్టేషన్ కో వెళ్ళే జనాలు మనిషిని గుర్తుపెట్టుకుంటారు కానీ డ్రస్సును కాదన్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసు స్టేషన్ కు వెళ్ళినపుడు హోమ్ గార్డు నుండి ఇన్ స్పెక్టర్ వరకు అందరు ఒకే రకమైన యూనిఫారం వేసుకుంటున్నారు. మరి వాళ్ళని జనాలు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు ?  తమకు ఎవరితో అయితే పనుందో వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ సదరు మనిషిని గుర్తు పెట్టుకుంటారే కానీ యూనీఫారంను బట్టి ఎవరు గుర్తు పెట్టుకోరన్న విషయం ప్రభుత్వ పెద్దలకు తెలీదా ? అయినా ఎందుకీ ప్రయోగానికి దిగారో అర్ధం కావటం లేదు. పైగా ఈ ఉద్యోగులెవరు ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగులు కారు.  మరి ఇంతోటి దానికి ప్రభుత్వం ఎందుకింత హడావుడి చేస్తోందో అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: