హెరాల్డ్ సెటైర్ : జగన్ కు చంద్రబాబుకు తేడా ఏమితో స్పష్టంగా తెలిసిందా ?

Vijaya
రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు ఇద్దరే. ఒకళ్ళేమో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అని చెప్పుకునే చంద్రబాబునాయుడు. మరొకరేమో ఫార్టీ ఇయర్స్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి. గడచిన ఐదు రోజులుగా జగన్ మీద ఎల్లోమీడియా, చంద్రబాబు గొంతులరిపోయేలా ఒకటే గోల చేస్తున్నారు. జగన్ పై తమకున్న అక్కసంతా ఎల్లోమీడియా బ్యానర్ వార్తల రూపంలో తీర్చుకుంటోంది. చంద్రబాబేమో నేతలతో జూమ్  కాన్ఫరెన్సులు పెట్టి జగన్ పై నానా యాగీ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలు కలిసి  మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారంటూ జగన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును జగన్ సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి లేఖ రూపంలో పంపించారు. తర్వాత మూడు రోజులకు దాన్ని మీడియా సమావేశం పెట్టి బహిర్గతం చేశారు. దాంతో  విషయం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రభుత్వ సలహాదారు చెప్పిన విషయాలను ఎల్లోమీడియా ఒక్క ముక్క కూడా ప్రచురించలేదు. కానీ ఆదివారం వదిలేసి సోమవారం నుండి బ్యానర్ హెడ్డింగులు పెట్టి నానా యాగీ చేస్తోంది.



ఇక్కడ హోలు మొత్తం మీద గ్రహించాల్సిందేమంటే జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడా. చంద్రబాబు ఎవరికి వ్యతిరేకంగా ఏమి చేసినా ఎప్పుడూ, ఎక్కడా బయటపెట్టడు. కొంతకాలం తర్వాత దానంతట అదే బయటపడాల్సిందే కానీ అధికారికంగా చంద్రబాబు మాత్రం బయటపెట్టరు. రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్యకు వ్యతిరేకంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సుప్రింకోర్టుకు ఫిర్యాదు చేశారు. తాను ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు. పోనీ ఆ విషయం ఆధారాలతో సహా బయటపడిన తర్వాతైనా ఒప్పుకున్నాడా అంటే అదీ లేదు.  విచిత్రమేమంటే తాను లేఖ రాయలేదనీ చెప్పడు, రాశానని ఒప్పుకోడు. ఇక రెండో విషయానికి వస్తే ఓటుకునోటు కేసును పరిశీలిద్దాం. 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణాలో ఎంఎల్సీ ఎన్నికల్లో వేలుపెట్టి మొత్తం చెయ్యే కాల్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.



ఏమాత్రం గెలుపు అవకాశాలు లేవన్న విషయం చంద్రబాబుకు తప్ప మిగిలిన నేతలందరికీ తెలుసు. అయినా టీడీపీ తరపున అభ్యర్ధిని పోటిలోకి దించాడు. టీడీపీ అభ్యర్ధి ఎలా గెలుస్తాడబ్బా అని అందరు అనుకుంటున్న సమయంలో  తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏకి డబ్బులిస్తు అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా అరెస్టయ్యాడు. దాంతో ఓహో ఎంఎల్ఏల ఓట్లకోసం కోట్ల రూపాయలు కొనుగోలు చేయటానికి చంద్రబాబు భారీ వ్యూహానికి తెరలేపాడన్న విషయం బయటపడింది.  తెలంగాణా పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో  ఓటుకునోటు స్కాం బయటపడి దేశంలో సంచలనం సృష్టించింది. తర్వాత నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన విషయం కూడా బయటపడింది. ఎందుకంటే వాళ్ళిద్దరి ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి.  ఆడియో టేపుల్లోని గొంతులెవరిదో నిర్ధారించేందుకు టేపులను  తెలంగాణా ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది.



సదరు టేపుల్లోని ఇద్దరి గొంతుల్లో ఒకరిది చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టంగా నిర్ధారించింది. ఇదే విషయాన్ని దర్యాప్తు చేసిన  ఏసీబీ అధికారులు హైకోర్టుకు కూడా సబ్ మిట్ చేశారు. ఇదే విషయాన్ని ఎన్నిసార్లు మీడియా అడిగినా ఓటుకునోటు విషయంలో తాను స్టీఫెన్ సన్ తో మాట్లాడానని కానీ మాట్లాడలేదని కానీ ఇంతవరకు చెప్పలేదు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కన్సార్షియం కంపెనీలతో స్విస్ చాలెంజ్ పద్దతిలో  చేసుకున్న అగ్రిమెంటును బయటపెట్టమని ఎంతమంది అడిగినా చంద్రబాబు అంగీకరించలేదు. పేరుకేమో పీపుల్స్ క్యాపిటల్. కానీ ఒప్పందంలో ఏమున్నాయో జనాలెవరికీ తెలీదు. ఇలాగుంటుంది చంద్రబాబు వ్యవహారం. మరి జగన్ విషయం పూర్తిగా డిఫరెంట్.  


సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను మూడు రోజుల తర్వాత యధాతధంగా మీడియాకు రిలీజ్ చేసేసింది ప్రభుత్వం. ప్రభుత్వం చెప్పకపోతే ఇప్పటికి కూడా జగన్ లేఖలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసేది కాదు. దీన్నే చంద్రబాబు, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతున్నారు. పైగా జగన్ చేసిన ఫిర్యాదుతో  టీడీపీతో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళ వ్యవహారాలన్నీ జనాలకు తెలిసిపోయింది. తమ గుట్టును జగన్ బహిర్గతం చేశాడన్నదే వీళ్ళ కడుపుమంటగా కనిపిస్తోంది. అందుకనే బాబ్డేకి రాసిన ఫిర్యాదును ఎలా మీడియాకు రిలీజ్ చేస్తారంటు పదే పదే మండిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: