మంచిమాట : కృతజ్ఞత లేనివాడికి ఎంత ఇచ్చినా తక్కువే..!

Divya
మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం కూడా ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. కానీ, దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి మాత్రం పొలం పనులు చేయటం ఇష్టం ఉండేది కాదు. నా పూర్వికులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తోంది. అని ఎప్పుడూ అనుకునేది.

అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయట పడాలని ఆలోచించేది. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢనిద్రలో ఉన్నాడు. దొంగ చేతికందిన వస్తువులన్నింటిని మూటకట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ, యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని వెళ్ళిపోతున్న దొంగ తో అయ్యా! అదే చేత్తో నా కట్టు విప్పతీయండి అని బతిమాలింది గుర్రం. దానికి దొంగ నీ కట్లు విప్పితే నాకేంటి లాభం? అన్నాడు.. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను. అని ప్రాధేయ పడింది..
 దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి.  చిన్నగా నవ్వాడు. నేను దొంగను నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్ర లేపలేదు. అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవటం ఎప్పటికైనా ప్రమాదమే'అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగ కు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండి పోయింది.. ఆ తర్వాతి నుంచి అది యజమాని చెప్పిన పనిని  చేస్తూ కృత జ్ఞతతో మెలగా సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: