మంచిమాట: ఎదుటి వాళ్ళ తప్పు చేసినప్పుడు వారిని మార్చడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి..!!

Divya
అనగనగా ఒక ఊరిలో చిన్ని, బంటి అనే ఇద్దరు పిల్లలు వుండేవారు.. వీరు ఇద్దరూ ఒకే బడిలో ఆరవ తరగతి చదువుతున్నారు. చిన్ని తనకు అప్పజెప్పిన ప్రతి పనినీ చాలా జాగ్రత్తగా చేసేది. కానీ బంటి మాత్రం కొంచెం అల్లరి పిల్లాడు..తన పనులు బాగానే చేసుకున్నా.. పక్క వారి పనులు చెడగొట్టి తను మాత్రం సరదా పడేవాడు.
ఒకరోజు బడిలో మాస్టర్ అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి, వాటిని బడి తోటలో నాటాలని చెప్పారు. ఇక పిల్లలందరూ మాస్టర్ చెప్పినట్టు గా  ఎవరి మొక్కను వారు చక్కగా నాటారు. ఇక చిన్ని ,బంటి కూడా వాళ్ల వాళ్ళ  మొక్కలు చక్కగా నాటారు.
ఇక బంటి తన మొక్క నాటడం అయిపోగానే పక్కనే నాటిన చిన్ని మొక్క వైపు చూశాడు. చిన్ని అటు తిరగ్గానే .. చిన్ని నాటిన  మొక్కను  పీకేసి ఏమీ ఎరగనట్టు నుంచున్నాడు. పాపం..! అది తెలిసిన చిన్ని ముఖం చిన్నబోయింది. అలా చేసింది బంటి అని చిన్నికి తెలుసు. వెంటనే మాస్టారు దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పింది. మాస్టారు వచ్చి పిల్లలని వరుసలో నిలబెట్టి ఇలా చెప్పారు. "పిల్లలు మన బడి తోటకు ఒక నాయకుడిని ఎంచుకోవాలి. మీలో అందరికన్నా భిన్నంగా మొక్క నాటిన బంటి అందుకు అర్హుడు. ఈరోజు నుంచి బంటి చెప్పింది మీరు అందరూ వినాలి. బంటి ఎవరైనా మొక్కలకి నీళ్ళు పోయకపోతే నాకు చెప్పు సరేనా. ఇక ఈ తోట బాధ్యత నీదే" అంటూ చెప్పాడు మాస్టారు.
ఉన్నపలంగా మాస్టారు తనని నాయకుడిని చేయడంతో బంటి పొంగిపోయాడు. వెంటనే తోట పర్యవేక్షణ మొదలుపెట్టాడు. పీకేసిన చిన్ని మొక్కను తానే గబగబా నాటేసి "చిన్ని నీ మొక్కను జాగ్రత్తగా చూడు"అన్నాడు.
చిన్ని..తన పథకం పారినందుకు.. మిత్రుడు మారినందుకు సంతోషించి మాస్టారు వైపు చూసి నవ్వింది. ఎదుటి వాళ్ళ తప్పు చేసినప్పుడు వారిని మార్చడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: