మంచిమాట: ఉన్నదానితో సంతృప్తి చెందాలి లేకపోతే వున్నది కూడా పోతుంది..!!

Divya
ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్లో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ.. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు.
అప్పుడు ఆ జింక "నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు కావాల్సింది కోరుకో"అంది. " నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను"అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు.రంగయ్యతో .. "నువ్వు వెంటనే వెళ్లి మనకు ఒక ఇల్లు కావాలి అడుగు" అని చెప్పింది భార్య
భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రంగయ్య కోరిన ఈ విధంగా ఒక ఇల్లు ఇచ్చింది.కొంతకాలం గడిచింది కమలమ్మ కు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది..రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మ కు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి "నా భార్య సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటోంది"అని చెప్పాడు.
అప్పటికే కోరికలన్నింటిని అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింక కు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. 'సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక'అనుకుంది.
"నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరిక ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి"అని బంగారు జింక తను అంతకు ముందు ఇచ్చిన వరాలన్నింటిని వెనక్కి తీసేసుకుని, మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: