మంచిమాట: పెను ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. సరైన ఆలోచన ఉండాలి..!

Divya
ఒక అడవిలో చిత్రగ్రీవుడు అనే ఒక కపోత రాజు వుండేవారు.. ఈయన తన తోటి కపోతాలతో కలిసి మెలసి జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక వేటగాడు ఆ కపోతాలను వేటాడాలని అనుకున్నాడు. ఆ సమీపంలో నేలపై కొన్ని నూకలు చల్లి, వాటిపై వల పన్ని తాను దూరంగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
     
 
తెల్లవారింది. చిత్రగ్రీవుడు ఆహార సంపాదన కోసం తోటి కపోతా లతో కలిసి ఆకాశంలో వెళ్తున్నాడు. వాటికి నేల మీద నూకలు కనిపించాయి. తమకు అవసరమైన ఆహారం దొరికిందని సంతోషించి అన్ని కపోతాలు నూకల పై వాలి వలలో చిక్కుకున్నాయి. పైకి ఎగరలేక పోయాయి. జరిగిన మోసం గ్రహించాయి. ఏమి చెయ్యాలో తోచక దుక్కిఃస్తున్నాయి.
ఈ విషయాన్ని గమనిస్తున్న వేటగాడు వాటిని పట్టుకొని బుట్టలో వేసుకోవడానికై నెమ్మదిగా బయలుదేరాడు. అది గమనించిన చిత్రగ్రీవుడు తోటి కపోతాలతో ఇట్లా అన్నాడు. "మిత్రులారా! ఆపద వచ్చినప్పుడు దుఃఖించడం మూర్ఖుల లక్షణం. తెలివిగలవారు ఆపద నుండి తప్పించుకొనే ఉపాయం ఆలోచించాలి. ఇప్పుడు నాకు ఒక ఉపాయం తోస్తున్నది చెప్తాను వినండి.
అందరం కలిసి ఒక్కసారిగా ఈ వల తాళ్లతో సహా పైకి ఎగిరి పోదాం. లేకపోతే వేటగాడి చేతిలో ప్రాణాలు పోక తప్పదు. అయితే చిత్రగ్రీవుడు చెప్పినట్టు వలతో సహా పైకి ఎగరటం సాధ్యమా! అని సందేహించకండి. పదిమంది కలిస్తే ఎటువంటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు."అన్నది.

ఆ మాటలకు ధైర్యం కలిగి కపోతాలన్ని ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరాయి.  వలతో సహా ఎగిరిపోతున్న కపోతాలను చూసి వేటగాడు ఆశ్చర్యపడి వాటి వెంట కొంతదూరం పోయి అవి కంటికి కనిపించక పోయేసరికి తన దురదృష్టాన్ని తానే నిందించుకుంటూ ఇంటికి వెళ్లాడు. తరువాత కపోతాలన్ని చిత్రగ్రీవుని మిత్రుడైన మూషిక రాజు నివాస స్థలానికి వెళ్లగా.. అతడు వల త్రాలను కొరికి కపోతాలను వల నుండి విముక్తులను చేశాడు. ఆలోచించి విజ్ఞానం చేసే శక్తి ఉన్నప్పుడు ఎటువంటి ఆ పరిస్థితుల నుంచి అయినా తప్పించుకోవచ్చు అని ఈ చిన్న కపోతాలు నిరూపించాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: