బొత్స మేనల్లుడికి 'ఢిల్లీ దారి' తప్పదా? విజయనగరం వైసీపీలో హాట్ టాపిక్!

Amruth kumar
విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు మరో కీలక పరిణామం దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడిగా జిల్లా రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, విజయనగరం జిల్లా పాలిటిక్స్‌లో చక్రం తిప్పేది ఈ 'చిన్న శ్రీనే' అని అందరికీ తెలిసిన విషయమే. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బలంగా ఉంటూ, స్థానికంగా మంచి పట్టు సాధించారు.



భీమిలీ ఇన్‌చార్జ్... కొత్త వ్యూహానికి సంకేతం!
చిన్న శ్రీను బలం, ఆయన సామాజిక వర్గం బలం (కాపు) వంటి సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆయనను మధ్యలో భీమునిపట్నం (భీమిలీ) వైసీపీ ఇన్‌చార్జిగా నియమించారు. భీమిలీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు విజయనగరంతో లింక్ అయి ఉండటం కూడా ఈ నియామకానికి మరో కారణం. అయితే, భీమిలీ టీడీపీకి కంచుకోట. అక్కడ ఉన్న గంటా శ్రీనివాసరావు వంటి బలమైన నేతను ఓడించడం కష్టం కావడంతో, వైసీపీ ఇప్పుడు కొత్త వ్యూహానికి తెర తీసిందని అంటున్నారు.



విజయనగరం ఎంపీ సీటుకు చిన్న శ్రీను!
ప్రస్తుతం భీమిలీ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ, రాబోయే ఎన్నికల ముందు మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంపీగా చిన్న శ్రీను అయితేనే, విజయనగరం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమన్వయం చేసుకుని, గెలుపు బాట పట్టించగలరని వైసీపీ అంచనా వేస్తోంది. ఈసారి బలమైన అభ్యర్థులను ఎంపీలుగా బరిలోకి దించడం ద్వారా, అసెంబ్లీ సీట్లను కూడా గణనీయంగా పెంచుకోవచ్చని వైసీపీ వ్యూహం. ఈ క్రమంలోనే చిన్న శ్రీనును ఢిల్లీ బాట పట్టించాలని జగన్ భావిస్తున్నారట.



చిన్న శ్రీను మనసు దేనిపై?
అయితే, చిన్న శ్రీను మనసు మాత్రం అసెంబ్లీ సీటుపైనే ఉందని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లోనే ఆయనను ఎంపీగా పోటీ చేయమని అడిగితే, ఆయన సున్నితంగా నిరాకరించారని అప్పట్లో వినిపించింది. ఇప్పుడు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తే తప్ప, ఆయన లోక్‌సభకు పోటీ చేస్తారా అనేది ప్రశ్నార్థకం. మొత్తానికి, బొత్స మేనల్లుడిని అసెంబ్లీ నుంచే ఎమ్‌పి సీటుకు మారుస్తారనే ప్రచారం ఇప్పుడు విజయనగరం రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్! ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున, ఈ సస్పెన్స్ ఎలా వీడుతుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: