12న ప్ర‌మాణ స్వీకారం.. ఆ తేదీ మార్చుకుంటే బెట‌రేమో బాబుగారు..!

RAMAKRISHNA S.S.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసేసారు. వైనాట్ 175 అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో ఏపీ ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఐదేళ్ల అరాచక పాలనను అంతం చేసేందుకు కూట‌మి వైపు మొగ్గు చూపి వైకాపా అభ్య‌ర్థుల‌ను బొక్క బోర్లా ప‌డేలా చేశారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న వైకాపా.. ఈసారి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకుని చరిత్రలో నిలిచిపోయే పరాజయాన్ని మూటగ‌ట్టుకుంది.

మరోవైపు 164 స్థానాల్లో భారీ మెజారిటీతో విజ‌యం సాధించిన ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు అయింది. జూన్ 12న  అమరావతిలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. తొలిత జూన్ 9న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అదే రోజు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్ర‌మాణ స్వీకారం ఉండ‌డంతో బాబు మార్చుకోక త‌ప్ప‌లేదు.

ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య‌ పక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో చంద్ర‌బాబు ప్రమాణ స్వీకారాన్ని 12వ తేదీకి మార్చారు. అయితే ఈ 12వ తేదీ పై ఇప్పుడు పెద్ద చర్చ మొదలయ్యింది. సీఎం గా బాబు గారి ప్రమాణ స్వీకారానికి 12వ తేదీ బుధవారం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. పంచాంగం గణనల‌ ప్ర‌కారం.. ఈ రోజు తిథి షష్టి. షష్టి రోజు ఏ పనీ పెద్దగా కలసిరాదు. అందుకే ఈ రోజు ఏ పనిని కొత్తగా ప్రారంభించరు. ష‌ష్ఠి న‌ష్ఠి అన్న సామెత అన్న‌ది కూడా అందుకే.

ఒకవేళ అమృత ఘడియలు, తారాఫలం చాసుకుని ప్రారంభించినా కూడా ఏదో ఒక అడ్డంకి మాత్రం తప్పద‌ని పండితులు అంటుంటారు. అలాంటి తిథి రోజును ఏపీ ముఖ్య‌మంత్రిగా అధికారం చేప‌ట్టేందుకు చంద్ర‌బాబు నాయుడు ఎంచుకోవ‌డం ప‌ట్ల భిన్నాభిప్రాయాలు వ‌స్తున్నాయి. ప్ర‌మాణ స్వీకారం తేదీని మార్చుకుంటే బెట‌ర్ అని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు సూచ‌న‌లు చేస్తున్నారు. అయితే 9వ తేదీ ఆదివారం తిథి తదియ చాలా మంచి రోజు. ఆ రోజు చేసే పనుల్లో విజయం, ఆనందం కలుగుతాయ‌ని అంటారు. కానీ స‌రిగ్గా అదే రోజు మోడీ పీఎంగా ప్ర‌మాణం చేయ‌బోతున్నారు.

13వ తేదీ గురువారం స‌ప్త‌మి. ఈ రోజు చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వాకారినికి ముహూర్తం పెట్టుకోవ‌చ్చు. అయితే విదేశాల్లో 13 అనేది అశుభ‌సూచ‌కంగా భావిస్తారు. 14వ తేదీ అష్టమి. ఈ తిథి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక 15 తేదీ న‌వ‌మి. ఆ రోజు జ‌న్మించిన‌ శ్రీరాముడికే క‌ష్టాలు తప్పలేదు మనమెంత.. అందుకే నవమి రోజు కూడా కొత్తగా ఏ కార్యాలూ ప్రారంభించరు. ఈ ర‌కంగా తిథులు చూసుకుంటే చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి చాలా ఆల‌స్యం అవుతుంది. అందుకే 12న ముహూర్తం ఫిక్స్ చేసి ఉండొచ్చ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: