దెందులూరు : వీడు ఆంధ్రా మాస్ మెచ్చిన మొన‌గాడ్రా... చింత‌మ‌నేని మ‌ళ్లీ గెలిచాడ్రా..!

RAMAKRISHNA S.S.
ఈసారి ఎన్నికలలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హాట్ హాట్ సీట్లలో దెందులూరు నియోజకవర్గం ఒకటి. దెందులూరు పేరు చెప్తేనే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు గుర్తుకు వస్తుంది. చింతమనేని ఎంత దూకుడుగా ఉంటారో.. ఎలాంటి కాంట్రవర్సీ నేతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దెందులూరు నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థులే పోటీపడ్డారు. 2019 ఎన్నికలలో లండన్ నుంచి వచ్చిన కొఠారు అబ్బయ్య చౌదరి.. చింతమనేనిని ఓడించారు. అంతకముందు 2009, 2014 ఎన్నికలలో చింతమనేని వరుసగా రెండుసార్లు విజయాలు సాధించారు.

నియోజకవర్గంలో పెదవేగి, దెందులూరు, పెదపాడు మండలాలతో పాటు ఏలూరు రూరల్ మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. దెందులూరు నియోజకవర్గం ముందు నుంచి కమ్మ సామాజిక వర్గానికి రాజకీయంగా పెట్టని కోటగా ఉంటూ వస్తుంది. 2009 ఎన్నికలలో అబ్బయ్య చౌదరి తండ్రి రామచంద్ర రావు పై చింతమనేని విజయం సాధిస్తే.. గత ఎన్నికలలో చింతమనేనిని అబ్బయ్య చౌదరి ఓడించి లెక్క సరిచేశారు. అయితే ఈసారి ఎన్నికలలో గెలిచేందుకు చింతమనేని సర్వశక్తులు వడ్డారు.

నోటిఫికేషన్ కు ముందు చూస్తే అబ్బయ్య‌ చౌదరి మరోసారి గెలుస్తారన్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే నోటిఫికేషన్ రావడం... ప్రభాకర్ పేరు ఆల‌స్యంగా ఎనౌన్స్ కావ‌డంతో పాటు.. ఈ సీటు బీజేపీకి కేటాయిస్తారన్న ప్రచారం చివరి వరకు ఆయనకు బీఫామ్ దక్కకపోవడం లాంటి పరిణామాలు నియోజకవర్గ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపాయి. పోలింగ్‌కు వచ్చేసరికి ప్రభాకర్ కాస్త పై చేయి సాధించినట్లు కనిపించింది. దెందులూరు పై రెండు పార్టీలు గట్టిగా ఆశలు పెట్టుకున్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తాం అన్న ధీమా ప్రదర్శించారు.

అయితే ఫైన‌ల్‌గా కౌంటింగ్‌లో చింత‌మ‌నేని వార్ వ‌న్‌సైడ్ చేసేశారు. గ‌త మెజార్టీల‌ను అధిగ‌మిస్తూ ఏకంగా 26266 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించి మూడోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌బోతున్నాడు. ఇక చింత‌మ‌నేని అసెంబ్లీ ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్‌లో ర‌చ్చ ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: