ముంబయ్ : గవర్నర్ జోక్యమంటే థాక్రే చేజారిపోయినట్లేనా ?

Vijaya



మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. తాజా పరిణామాల ప్రకారం చూస్తే గవర్నర్ భగవత్ సింగ్ కోషియారీ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా, తిరుగుబాటు ఎంఎల్ఏలకు భద్రతతో పాటు వారి కుటుంబసభ్యుల భద్రత విషయంలో కూడా గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్ధితులను సమీక్షిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే గవర్నర్ జోక్యం చేసుకున్నారంటే వ్యవహారం మొత్తం బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయినట్లే.



ఎలాగంటే గవర్నర్-సీఎం ఉధ్థవ్ థాక్రేకి ఏమాత్రం పడటంలేదు. సీఎంకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని గవర్నర్ నూరుశాతం ఉపయోగించుకుంటున్నారు. గవర్నర్ అంటేనే రాష్ట్రపతి ప్రతినిధి అన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రతినిధి అంటే కేంద్రప్రభుత్వం ప్రతినిధే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే బంతి అటుతిరిగి ఇటు తిరిగి చివరకు నరేంద్రమోడి చేతిలోకే వెళుతుంది. తన స్ధాయిలో థాక్రే వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటే ఒక పద్దతిగా ఉంటుంది. అలాకాదంటే మాత్రం వ్యవహారం కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయినట్లే.



వ్యవహారం మొత్తం ఒకసారి కేంద్రం చేతిలోకి వెళితే థాక్రే ప్రభుత్వం నిలవటం కష్టమే. ఏదో పద్దతిలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు ఇప్పటి పరిస్ధితులు కూడా అనువుగానే ఉన్నాయి. ఎలాగంటే మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయి వారంరోజులవుతోంది. ఇంతవరకు తిరుగుబాటు ఎంఎల్ఏలు 37 మంది ప్రభుత్వం దారికి రాలేదు. అలాగని వాళ్ళసలు  రాష్ట్రంలోనే లేరు.



శివసేన పార్టీలో తిరుగుబాటు కారణంగా ప్రభుత్వం కూలిపోయిందని చెప్పేందుకు లేదు. ఇదే సమయంలో సాఫీగా నడుస్తోందని అనేందుకు లేదు. అంటే దాదాపు వారంరోజులుగా ప్రభుత్వం ఉందో లేదో కూడా ఎవరు చెప్పలేకున్నారు. ఈ పరిస్ధితుల్లో ఎక్కువ రోజులు ఇలా కంటిన్యు అయ్యేందుకు లేదు. అందుకనే గవర్నర్ జోక్యంచేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని థాక్రేయే గవర్నర్ కు ఇచ్చినట్లవుతోంది. కాబట్టే గవర్నర్ జోక్యమంటే థాక్రే ఫెయిలైనట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: