అమరావతి : ఇంతకీ జనాలు ఎవరిని కోరుకుంటున్నారు ?

Vijaya



‘వచ్చే ఎన్నికల్లో జనాలందరు జనసేనకు అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారు’ ..పవన్

’వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే టీడీపిని గెలిపించాలని జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు’.. చంద్రబాబు

‘వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ వైసీపీనే గెలవాలి’..జగన్


ఇది స్ధూలంగా ఏపీ రాజకీయ ముఖచిత్రం. పై మూడుపార్టీల అధినేతలు పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేసినట్లే అని భ్రమల్లో ముణిగిపోయారు.




జగన్ పాలనంతా అరాచకాలని, అణిచివేతలు, దాడులతోనే జరుగుతోందంటు చంద్రబాబు, పవన్ మండిపోతున్నారు. అయితే ప్రతిపక్షాల్లో ఏదికూడా అవినీతి జరుగుతోందని మాత్రం చెప్పటంలేదు. రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చేశారని గోలచేస్తున్నారు. అయితే రాష్ట్రం ప్రస్తుత అప్పుల్లో చంద్రబాబు పాత్రకూడా ఉందన్నది వాస్తవం. ఈ విషయాన్ని చంద్రబాబు అంగీకరించటంలేదు సరే మరి పవన్ కూడా ఎందుకని చెప్పటంలేదు ? ఇందుకనే పవన్ను జగన్ అండ్ కో చంద్రబాబు దత్తపుత్రుడంటున్నది.




ఇక పవన్ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం జనసేనదే అని ఎలా చెబుతున్నారో అర్ధం కావటంలేదు. జగన్ పై మంటతోనే తాను అధికారంలోకి వచ్చేయాలని కలలు కంటున్నారంతే. జనసేన అధికారంలోకి వచ్చేస్తుందనేందుకు ఆధారాలేమీ లేవు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా జనాల్లో జగన్ పై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత వచ్చేసిందని పదే పదే ప్రచారం చేస్తున్నారు. జనాల్లో జగన్ అంటే వ్యతిరేకత వచ్చేసిందని అనటానికి ఆధారాలేమీలేవు.




చివరగా 175కి 175 సీట్లూ వైసీపీనే గెలవాలని జగన్ గట్టిగా కోరుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కకూడదన్నది జగన్ ఆలోచన. కానీ ఇది జరగదని జగన్ కు కూడా బాగా తెలుసు. సంక్షేమ పథకాలు అందుకుంటున్నవాళ్ళంతా ప్రభుత్వానికే ఓట్లేస్తారని గ్యారెంటీలేదు. పలానా పార్టీ గెలిచిందన్నా, లేకపోతే ఓడిందన్నా అందుకు అనేక కారణాలుంటాయి. ఇంకా ఎన్నికలకు రెండేళ్ళకాలముంది కాబట్టి ఏమి జరుగుతుందో చెప్పలేం. ఎన్నికల్లో పోల్ మ్యానేజ్మెంట్ పైనే అధికారం ప్రధానంగా ఆధారపడుంది. అంతాబాగానే ఉందికానీ అసలు జనాల మనసుల్లో ఏముందనేది ఎప్పుడు తెలుస్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: