అమరావతి : టీడీపీని గెలిపించే బాధ్యత పవన్ దేనా ?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు రాజకీయం మొదటి నుండి చాలా విచిత్రంగానే ఉంటుంది. తనంతట తానుగా ప్రత్యర్ధిని ఎప్పుడూ గెలవలేరు. ఎవరి మీదైనా చంద్రబాబు గెలవాలంటే ఇంకెవరి సాయం ఉండాల్సిందే. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, పార్టీని లాక్కున్నా, 1999 ఎన్నికల్లో గెలిచినా, చివరకు 2014 ఎన్నికల్లో గెలిచినపుడు కూడా ఇతరుల ఊతసాయం లేనిదే గెలవలేదు.
మరలాంటి చంద్రబాబు 2024 ఎన్నికల్లో ఏమి చేయబోతున్నారు ? ఏమి చేయబోతున్నారంటే ఇప్పటి నుండే పవన్ కు అంటు లవ్ లెటర్లు రాస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జనగ్మోహన్ రెడ్డిపైన గెలవాలంటే పవన్ ఒక్కడే చంద్రబాబు దిక్కని అనుకుంటున్నారు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్ధులు ఓటమికి జనసేనకు వచ్చిన ఓట్లే కారణమయ్యాయి. వైసీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్ల మెజారిటి కన్నా జనసేనకు పడిన ఓట్లెక్కువ. సుమారు 16 నియోజకవర్గాల్లో ఈ విధంగా జరిగిందని సమాచారం.
ఇది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే కాదు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఇలాగే జరిగింది. సో, ఇలాంటివన్నీ లెక్కలేసుకున్న చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటే జగన్ను చాలా ఈజీగా ఓడించవచ్చని అంచనా వేసుకుంటున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు ఓ 50 అసెంబ్లీ సీట్లిచ్చినా, 10 లోక్ సభ సీట్లిచ్చినా మిగిలిన నియోజకవర్గాల్లో లాభపడవచ్చన్నది చంద్రబాబు భావన. అందుకనే పవన్లో చంద్రబాబు ‘దేశ’ రక్షకుడు కనబడుతున్నాడు.
వయసు రీత్యా తీసుకుంటే చంద్రబాబుకు దాదాపు ఇదే చివరి ఎన్నికలని చెప్పాలి. రాజకీయంగా చంద్రబాబు జీవితం క్లైమ్యాక్సుకు వచ్చేసినట్లే. 2024 ఎన్నికలకు చంద్రబాబు వయసు సుమారు 75 ఉంటుంది. అధికారంలోకి వస్తే వచ్చే ఎన్నికల్లోనే రావాలి లేకపోతే టీడీపీ సంగతి అంతే సంగతులు. ఈ లెక్కలన్నీ బాగా వేసుకున్న తర్వాతే పవన్ వెంట చంద్రబాబు పడుతున్నది. చంద్రబాబుతో పొత్తు వద్దని జనసేనలోని కీలక నేతలు చాలామంది అంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.