ఆ జిల్లా ఏర్పాటుపై జగన్‌ కు సొంత పార్టీ నేతల షాక్..?

Chakravarthi Kalyan
ఏపీలో కొత్త జిల్లాలు వచ్చేశాయి.. ఇప్పుడు ఉన్న 13 జిల్లాలకు తోడుగా మరో 13 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనే లభిస్తోంది. పెద్దగా వ్యతిరేకతలు కనిపించడం లేదు. అయితే.. ఓ జిల్లా విషయంలో మాత్రం రగడ ప్రారంభమైంది. కడప జిల్లా నుంచి కొంత భాగాన్ని విడదీసి.. అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేశారు. అది బాగానే ఉంది. కానీ ఈ అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాయచోటిని నిర్ణయించడంతో ఇబ్బంది ఎదురైంది. దీన్ని రాజంపేటవాసులు వ్యతిరేకిస్తున్నారు.

కొత్త జిల్లాలలను పార్లమెంటు నియోజక వర్గాల ఆధారంగా ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు ఎంపీ సీటైన రాజంపేటను కాదని.. రాయచోటిని ఎలా జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజంపేటను కాదని రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై స్థానిక వైసీపీ నేతలు కూడా గరంగరం అవుతున్నారు. ఈ మేరకు రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి ఏకంగా సీఎం జగన్‌కు ఘాటుగా వీడియో మెస్సేజ్‌ చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని  సెల్ఫీ వీడియోలో మర్రి రవి సీఎం జగన్ కు ఘాటుగా విజ్ఞప్తి చేశారు.

మా రాజంపేట ప్రజలను అడక్కుండా జిల్లా కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేయడం సమంజసం కాదని మర్రి రవి ఆ వీడియోలో జగన్‌కు తెలిపారు. అన్నమయ్య జిల్లా పేరును అన్నమయ్య పుట్టిన ఊరు కేంద్రంగా కాకుండా వేరే చోట పెట్టడం అన్యాయం అంటున్నారు. కావాలంటే రాయచోటిని మదనపల్లిలో కలుపుకొని మరో జిల్లా ఏర్పాటు చేయాలని.. అంతే తప్ప అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటని పెట్టడం సరికాదని వాదిస్తున్నారు.

అదీ కుదరదంటే.. మమ్ములను ఇప్పటిలాగా కడప జిల్లాలోనే ఉంచితే గౌరవంగా ఉంటుందన్నారు. రాజంపేట వాసులను అనాధ బిడ్డల్లాగా రాయచోటిలో కలిపారని.. ఇలా చేస్తే రాజంపేటలో తాము తల ఎత్తుకుని తిరగలేమని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే ఫైనల్ అయితే.. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో వైసీపీ ఓటమి ఖాయం అని ముందే చెప్పేస్తున్నారు. అవసరమైతే వైస్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తానని మర్రి రవి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: