అలర్ట్: ఒమిక్రాన్‌ను లైట్‌ గా తీసుకుంటున్నారా..?

Chakravarthi Kalyan
ఒమిక్రాన్.. ఈ పేరు విన్న మొదట్లో జనం హడలిపోయేవారు.. అదేదో ఒమిక్రాన్ అంట.. అది డెల్టా వేరియంట్ కంటే డేంజర్‌ అంట.. ఏకంగా ఒక్కొకరి నుంచి ఆరు మంది వరకూ వ్యాపిస్తుందట.. డెల్టా కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందట.. ఇలా చాలా విశేషాలు ఒమిక్రాన్ గురించి బయటకు వచ్చాయి. అలా ఒమిక్రాన్ ఇండియాలో అడుగు పెట్టక ముందే.. దాని వివరాలన్నీ మీడియాలో హోరెత్తాయి. అవును మరి..కరోనాలో కొత్త వేరియంట్ అంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదా.

కానీ.. వాస్తవంలో ఏమైంది..  ఇప్పుడు దేశమంతటా కరోనా ఒమిక్రాన్ కేసులు వస్తున్నా.. జనం లైట్‌ గా తీసుకుంటున్నారు. ఒమిక్రాన్‌ వచ్చినా.. చాలా మందిలో దాని లక్షణాలు రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండడం లేదు. కొందరిలో అసలు లక్షణాలే ఉండటం లేదు. ఇలా ఒమిక్రాన్ ప్రభావం చాలా తక్కువ అని తేలిపోయింది. జనం కూడా రిలాక్స్ అయ్యారు. లైట్‌ గా తీసుకోవడం ప్రారంభించారు.

అయితే.. ఒమిక్రాన్‌ వస్తే.. మరీ అంత లైట్‌గా తీసుకోవద్దంటున్నారు నిపుణులు. వైరస్ ఏదైనా అలసత్వం అసలే చూపొద్దంటున్నారు.  వైరస్‌ రకం ఏదైనా జాగ్రత్తలు యథావిధిగా పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒమిక్రాన్‌ వల్ల ఇంట్లోనే ఉంటున్నా తగిన చికిత్స తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. అయితే.. ఎక్కువగా ఆందోళన చెందకుండా, అవగాహన పెంచుకొని మసలుకోవాలని సూచిస్తున్నారు.

ఒమిక్రానే కదా.. ఏమీ కాదులే అని లైట్‌ గా తీసుకోవద్దంటున్నారు. కొవిడ్‌ బారినపడుతున్న అందరికీ ఒమిక్రానే వచ్చిందని చెప్పలేం కదా. మన వాతావరణంలో ఇంకా డెల్టా వైరస్‌  అలాగే ఉంది. ఒకవేళ మనకు వచ్చింది డెల్టా అయితే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాస్తవానికి  ఎవరికి ఏ రకం వైరస్‌ సోకిందనేది చెప్పటం కష్టం. ఒమిక్రాన్‌ ఆరోగ్యవంతులను టీకాలు తీసుకున్నవారిని పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా.. సుగర్, బీపీ ఉన్నవారు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే. టీకాలు పూర్తిగా తీసుకోనివారు కూడా నిర్లక్ష్యం వద్దని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: