హైదరాబాద్ : జగన్నే ఫాలో అవుతున్న గులాబీ బాస్ ?

Vijaya


జగన్మోహన్ రెడ్డి బాటలోనే తెలంగాణా సీఎం కేసీయార్ నడుస్తున్నారు. తాజాగా తెలంగాణా క్యాబినెట్ తీసుకున్న మూడు నిర్ణయాలను చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే విద్యా వ్యవస్ధకు సంబంధించి క్యాబినెట్ మూడు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నది. ఆ మూడు కూడా ఇప్పటికే ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు.



ఇంతకీ అవేమిటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం. రెండోది ఏమిటంటే ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చేయటం. ఇక మూడో నిర్ణయం ఏమిటంటే ప్రభుత్వ స్కూళ్ళ రూపురేఖలను మార్చాలనే నిర్ణయం. తెలంగాణా క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలో జగన్ ఎప్పుడో తీసుకున్నారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టే విషయం బాగా వివాదాస్పదమైంది. ముందు దీనికి చంద్రబాబునాయుడు మద్దతిచ్చి మళ్ళీ యూ టర్న్ తీసుకోవటం పెద్ద వివాదమైంది.



ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టే విషయంలో టీడీపీ మద్దతుదారులు కోర్టుల్లో కేసులు కూడా వేశారు. ఇక ఫీజుల నియంత్రణ విషయంలో కూడా చాలామంది కోర్టులో కేసులు వేశారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానికి అధికారం లేదని సింగిల్ బెంచ్ తీర్పుచెప్పింది. దీన్ని జగన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది. ఎక్కడైనా జనాలు ఫీజులు తగ్గించాలని కోరుకుంటారు. కానీ ఏపీలో మాత్రం ఫీజుల నియంత్రణ అధికారం ప్రభుత్వానికి లేదంటు కోర్టుకెక్కారు. ప్రభుత్వం కూడా కోర్టులో పోరాడుతోంది లేండి ఇదే విషయమై.



చివరగా ప్రభుత్వ స్కూళ్ళకు రూపురేఖలు మార్చాలని నిర్ణయించటం. ఏపీలో నాడు-నేడు అనే పేరుతో సుమారు 16 వేల స్కూళ్ళను మొదటిదశలో బ్రహ్మాండంగా రూపురేఖలు మార్చేశారు. ప్రభుత్వ స్కూళ్ళని చూసిన వారు అది ప్రభుత్వ స్కూలే అంటే ఒకపట్టాన నమ్మలేరు. పిల్లలు కూర్చునేందుకు బల్లలు, టాయిలెట్లు, మంచినీటి సకౌర్యం, కాంపౌండ్ వాల్, స్కూల్ గోడలకు అందమైన పెయింటింగులతో వెలిగిపోతున్నాయి. ఇలాంటి సౌకర్యాల కారణంగానే ప్రైవేటు స్కూళ్ళ నుండి లక్షలమంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ళకు మారిపోతున్నారు. తెలంగాణాలో కూడా ఈ పద్దతినే అనుసరించబోతున్నారు. మొత్తానికి కేసీయార్ కూడా జగన్నే ఫాలో అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: