అద్దిరే వార్త: బ్రిటన్‌ ప్రధానిగా మనోడికి ఛాన్స్..?

Chakravarthi Kalyan
బ్రిటన్.. ప్రపంచ పటంలో ఓ చిన్న దేశం.. చాలా చిన్న దేశం.. కానీ.. ఆ దేశం ఒకప్పుడు ఏకంగా ప్రపంచాన్ని ఏలేసింది. భూమండలంలోని సగానికి పైగా దేశాలను తన గుప్పిట్లో ఉంచుకుంది. వందల ఏళ్లపాటు పాలన చేసింది. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్‌ అని చెప్పుకునే రేంజ్‌లో ఉండేది.. అంటే ఈ బ్రిటీష్‌ సామ్రాజ్యంలో రవి అస్తమించడన్నమాట. అంటే అంత విశాలమైంది. అలాంటి బ్రిటన్‌ ఇండియాను దాదాపు 400 ఏళ్లు ఏలింది. రత్నగర్భంగా పేరున్న మన దేశాన్ని పూర్తిగా  దోచేసుకుంది. మన శాస్త్రాలను కొల్లగొట్టింది. ఇలా బ్రిటన్ అరాచకాలు ఎన్నో..

అలాంటి బ్రిటన్‌ను ఒక ఇండియన్‌ సంతతి వ్యక్తి పాలించే రోజు రాబోతోందా.. అంటే అవుననే అనిపిస్తోంది. బ్రిటన్‌ తదుపరి ప్రధానమంత్రి ఓ భారత సంతతి వ్యక్తి కానున్నాడే ఊహాగానాలు జోరుగా వస్తున్నాయి. అదెలా సాధ్యం అంటారా.. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పై ఇంటా బయటా..తీవ్ర వ్యతిరేకంగా నెలకొంది. బోరిస్‌ జాన్సన్‌పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా కట్టడిలో ఆయన విఫలం అయ్యారన్న వాదన ఉంది.

దీనికితోడు ఏడాదిన్నర క్రితం బ్రిటన్‌లో కోవిడ్‌ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. బోరిస్‌ తన అధికార నివాసంలో మద్యం విందు నిర్వహించాడట. ఇప్పుడు ఆ అంశం బ్రిటన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చివరకు ఈ అంశంపై బోరిస్‌ నిన్న పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు. అయినా ఆయనపై వ్యతిరేకత తగ్గడం లేదు. బోరిస్ తీరుపై బ్రిటన్‌లోని ప్రతిపక్ష లేబర్‌ పార్టీతోపాటు సొంత కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. రాజీనామా చేయాలన్న డిమాండ్‌లు వస్తున్నాయి.

ఒకవేళ అదే జరిగితే.. బోరిస్‌ స్థానంలో ప్రధాని అయ్యే వ్యక్తి ఎవరన్న ఊహాగానాలు బయలుదేరాయి. ఆ పార్టీలో ప్రధాని రేసులో భారతసంతతి వ్యక్తి రిషి సునక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ రిషి సునక్‌ ఎవరో కాదు.. మన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు. ప్రస్తుతం రిషి బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అలా కాలం కలసిసొస్తే మన నారాయణమూర్తి అల్లుడు రిషి బ్రిటన్ ప్రధాని అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: