చైనాతో చ‌ర్చ‌ల్లో వీడ‌ని ముడులు..?

భార‌త చైనాల మ‌ధ్య తూర్పు ల‌ద్ధాఖ్ ప్రాంతంలో ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించేందుకు రెండు దేశాల‌కు చెందిన ర‌క్ష‌ణ‌, విదేశాంగ అధికారుల మ‌ధ్య కొన‌సాగుతున్న చ‌ర్చ‌లు ఏమంత ముందుకు వెళ్ల‌డం లేదు. తాజాగా 14వ కోర్ క‌మాండర్ స్థాయిలో జ‌రిగిన చ‌ర్చ‌లు కూడా ఫ‌లితం ఇవ్వ‌లేదు. ఇదే అంశాన్నిరెండుప‌క్షాలు గురువారం ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించాయి. అయితే చ‌ర్చ‌లు మున్ముందూ కొన‌సాగించాల‌ని, ఇరు ప‌క్షాల‌కూ ఆమోదయోగ్యమైన ప‌రిష్కారం దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాల‌ని మాత్రం అంగీక‌రించాయి. దీంతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల పీట‌ముడులు అంత తేలిగ్గా వీడేలా క‌నిపించ‌డంలేదు. భారత చైనాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య త‌ర‌చుగా ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. నిజానికి భార‌త్‌, చైనా యుద్ధం త‌రువాత ఇరు దేశాల మ‌ధ్య చాలాకాలంపాటు గొడ‌వ‌లు లేవ‌నే చెప్పాలి. స‌రిహ‌ద్దు వివాదం ఉన్నా అది చ‌ర్చ‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యేది. అయితే ఆసియాలో భార‌త్ కూడా బ‌ల‌మైన ఆర్థిక శ‌క్తిగా చైనాకు పోటీగా ఎదుగుతుండ‌టం, పాశ్చ్యాత్త దేశాల్లో ప‌లుకుబ‌డి పెంచుకోవ‌డం గిట్ట‌ని చైనా పాల‌కులు ఇటీవ‌లి కాలంలో మ‌ళ్లీ భార‌త్‌పై విద్వేష వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

 
ఇందులో భాగంగానే స‌రిహ‌ద్దుల్లో జూన్ 16, 2020న భార‌త్ సైనికుల‌ను క‌వ్వించి వారిపై దాడి చేసి 20 మందిని చైనా సైన్యం బ‌లి తీసుకుంది. దాంతో ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. భార‌త్ సైనికుల ప్ర‌తిదాడిలో ప‌లువురు చైనా సైనికులు కూడా చ‌నిపోయారు. కానీ చైనా ప్ర‌భుత్వం దానిని చాలాకాలం అంగీక‌రించ‌లేదు. నాటినుంచి ఇండో చైనా స‌రిహ‌ద్దుల్లోని ల‌ద్దాఖ్ ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన‌ ప‌ర్వ‌త‌ ప్రాంతాల్లో ప‌ట్టు పెంచుకునేందుకు ఇరుదేశాల సైన్యాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అక్క‌డకు ఆయుధాలు చేర‌వేయ‌డంతోపాటు బంక‌ర్లు కూడా నిర్మించుకున్నాయి. దీంతో రెండు దేశాల మ‌ధ్య మ‌రింత ఉద్రిక్త‌త‌లు పెర‌గ‌కుండా క్ర‌మం త‌ప్ప‌కుండా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే చైనా త‌న‌కు స‌హ‌జ కుటిల వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తూ చ‌ర్చ‌ల ద్వారా కాల‌యాప‌న చేస్తూ స‌రిహ‌ద్దుల్లో బ‌ల‌గాల‌ను పెంచుకుంటోంది. చైనా వైఖ‌రి భార‌త్‌ను అనివార్యంగా ఆయుధ పోటీలోకి లాగి ఆర్థికంగా దెబ్బ తీసేందుకేన‌న్న అభిప్రాయాలూ ర‌క్ష‌ణ రంగ నిపుణుల‌నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: