కుప్పంలో కొత్త ట్విస్ట్: డైరక్ట్ బరిలోకి పెద్దిరెడ్డి?

M N Amaleswara rao
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎక్కడకక్కడ కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి. బలమైన వైసీపీని ఎదురుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో బలమైన జగన్ నాయకత్వాన్ని ఎదురుకుంటుంటే...మరోవైపు సొంత జిల్లా చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఢీకొట్టాల్సిన పరిస్తితి ఉంది. జగన్ వల్ల రాష్ట్రంలో టీడీపీ నష్టపోతే...పెద్దిరెడ్డి వల్ల చిత్తూరులో టీడీపీ నష్టపోయింది. పెద్దిరెడ్డి ప్రభావం వల్ల చిత్తూరులో టీడీపీ ఎంతలా నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆఖరికి కుప్పంలో కూడా టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది. స్థానిక ఎన్నికల్లో కుప్పంలో పూర్తిగా వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. దానికి కారణం కూడా పెద్దిరెడ్డి అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే చంద్రబాబు ప్రత్యేకంగా పెద్దిరెడ్డిపై ఫోకస్ పెట్టారు. కుప్పంలో బలపడటంతో పాటు జిల్లాలో పెద్దిరెడ్డి హవా తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై అక్రమ మైనింగ్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అక్రమ మైనింగ్‌లో పెద్దిరెడ్డి ఆరితేరిపోయారని చెప్పి చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.
అయితే బాబుకు పెద్దిరెడ్డి కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో సహ నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కుప్పంలో బాబుపై అటెండర్‌ని నిలబెట్టి గెలిపిస్తామని కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా గట్టిగానే స్పందిస్తున్నాయి. చిత్తూరులో అక్రమాలు చేయడంలో పెద్దిరెడ్డి టాప్ అని, ఇక పెద్దిరెడ్డికి దమ్ముంటే డైరక్ట్‌గా కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు.
ఇక ఈ సవాళ్ళు పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి కుప్పం బరిలో దిగడం కష్టం. ఆయన పుంగనూరు బరిలోనే ఉంటారు. అదే సమయంలో కుప్పంలో బాబుని ఓడించడం అంత ఈజీ కాదు. లోకల్ ఎన్నికల్లో గెలిచినంత సులువుగా సాధారణ ఎన్నికల్లో గెలవలేరు. కాబట్టి ఈ సవాళ్ళు మాటలకే తప్ప చేతల్లో ఉండవని చెప్పొచ్చు. చూడాలి మరి కుప్పం రాజకీయాల్లో ఇంకెన్ని ట్విస్ట్‌లు వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: