ప్రాజెక్టులు సేఫ్‌గా ఉన్నాయా... జగన్ సమీక్ష..!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు సృష్టించిన నష్టం అంతా ఇంత కాదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6 వేల 670 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో పంట నష్టమే 3 వేల 450 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నివేదిక సమర్పించారు కూడా. ఇక కేంద్ర ప్రతినిధుల బృందం కూడా రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేసి వెళ్లింది. భారీ వరద కారణంగా కడప జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఇక అన్నమయ్య ప్రాజెక్టు అంశం అయితే జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షేకావత్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు కొట్టుకుపోయిందని... ప్రాణ నష్టం కూడా భారీగా సంభవించినట్లు ప్రతిపక్షాల నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించారు కూడా. ఇక రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే.... కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సైతం తప్పుబట్టారు. సరైన అవగాహన లేకుండానే కేంద్ర మంత్రి వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఎదురు దాడి చేశారు కూడా. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అసలు ప్రాజెక్టుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిజర్వాయర్ల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను ఆదేశించారు కూడా. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల వద్ద ఏవైనా నిర్వహణ లోపాలు ఉంటే... వెంటనే సరిదిద్ద్దాలని కూడా సూచించారు. ప్రస్తుతం రిజర్వాయర్ల పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్నారు వైఎస్ జగన్. దీని వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: