ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు త్వ‌ర‌లో శుభ‌వార్త‌..!

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త చెప్ప‌డానికి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు.  ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జ‌గ‌న్ దాదాపు 3గంట‌ల పాటు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్  చేస్తుండ‌డం.. మ‌రోవైపు   గ‌త మూడు రోజుల నుంచి ఏపీ ఉద్యోగ సంఘాలు ఆందోళ‌నలో పాల్గొన్నాయి.  ఇప్పటికే పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు కార్యచరణను కూడా ప్రకటించాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం కూడా అయ్యాయి ఉద్యోగ సంఘాలు.
సీఎం జ‌గ‌న్ ఇవాళ ఆర్థిక నిపుణుల‌తో సమీక్ష ముగిసిన త‌రువాత ఉద్యోగుల‌లో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెల‌కొన్న‌ది. 34 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌దంటూ ఉద్య‌గుల వాట్సాప్ గ్రూపుల‌లో సందేశాలు వైర‌ల‌వుతున్నాయి. మ‌రోవైపు పీఆర్సీపై ప్ర‌భుత్వం శ‌నివారం నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రంటుంటే.. మరికొంద‌రూ సోమ‌వారం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటున్నారు. అయితే ఏండ్ల త‌ర‌బ‌డి ప్ర‌భుత్వం త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డంతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌రువాత‌ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ఏ ఒక్కటీ  కూడా  పరిష్కరించకపోవడంతో  ఉద్యోగులు  ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ త‌రుణంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పీఆర్సీతో సహా ఉద్యోగుల సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యమ కార్యాచరణకు కూడా  పిలుపునిచ్చాయి. జేఏసీలు ఇచ్చిన ఐక్య ఉద్యమ కార్యాచరణకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిరసన వంటి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ ఉన్నారు. మూడు రోజుల నుంచి నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవుతూ.. ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులు ఉద్యమానికి ఊతమిస్తున్నారు. అయితే ఇవాళ సీపీఎస్ రద్దు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులను సర్వీసులను రెగ్యుల‌రైజ్ చేయ‌డం వంటి కీలక అంశాలపై సీఎం చర్చించినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: