హైకోర్టులో జగన్ సర్కార్‌కు మరో దెబ్బ...!

Podili Ravindranath
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగులుతూనే ఉన్నాయి. దీంతో చివరికి ఏం చేయాలో తెలియక... తమ జీవోలను తనే వెనక్కి తీసుకుంటూ యూ టర్న్ బాట పడుతోంది జగన్ సర్కార్. నిబంధనల్ని, చట్టాల్ని కనీస పట్టించుకోకుండా ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంది జగన్ ప్రభుత్వం. ఇలా తీసుకున్న నిర్ణయాలు... న్యాయ పరీక్షలో నిలబడటం లేదు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం, శాసన మండలి రద్దు నిర్ణయం... ఇలా ఎన్నో నిర్ణయాల జాబితాలో మరో రత్నం చేరిపోయింది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని తాజాగా హైకోర్టు తప్పుబట్టింది. దీంతో ఇక చేసేది లేక... వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా హైకోర్టుకు నివేదిక సమర్పించింది ఏపీ ప్రభుత్వం.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కూడా హైకోర్టులో దోషులుగా నిలబడుతున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు హైకోర్టుకు కూడా హాజరయ్యారు. వైఎస్ జగన్ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ. 2019 అక్టోబర్ 2వ తేదీ నుంచి సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. సచివాలయాల్లో పని చేస్తున్న గ్రామ కార్యదర్శుల్ని మహిళల సంక్షేమం కోసం ఏర్పాటు కూడా చేశారు జగన్. ముందుగా వీరికి హోమ్ శాఖకు అటాచ్ చేసిన ప్రభుత్వం... ఆ తర్వాత వారిని మహిళా పోలీసులుగా గుర్తించింది కూడా. పోస్టింగ్ ఇచ్చిన రోజు నుంచి వీరిని మహిళా పోలీసులుగానే అనధికారికంగా ప్రభుత్వం పిలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జీవో నంబర్ 59ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... పలు అభ్యంతరాలు చెప్పింది. దీంతో చేసేది లేక ఈ జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైఎస్ జగన్ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: