టీఆర్ఎస్‌లో కాక మొద‌లైందిగా..!

VUYYURU SUBHASH
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల గోల మామూలుగా లేదు. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో టిఆర్ఎస్ రాజకీయాలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష, ఆమె భర్త లక్ష్మీనారాయణకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని తెలుస్తోంది. శిరీష దంపతులు ఒకప్పుడు ఎమ్మెల్యేకు అనుచరులే. అందుకే జనరల్ సీటులో కూడా బిసి వర్గానికి చెందిన శిరీష్ చైర్‌ప‌ర్స‌న్ అయ్యేలా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చక్రం తిప్పారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ రావడంతో పాటు పంతాలు చూసుకుంటున్నారట.

కోదాడ మున్సిపాలిటీ కౌన్సిల్‌ ఏర్పడిన తర్వాత కరోనా వల్ల పాలకవర్గాల మీటింగులు జరగలేదు. దీంతో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ... మున్సిపల్ అధికారులతో నేరుగా మాట్లాడేసి పట్టణ పరిధిలో ఏయే పనులు చేపట్టాలో ఆదేశాలు ఇచ్చేవారట. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ తేడా కొట్టిందో ఏమో గాని ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య ఏ మాత్రం పొస‌గ‌టం లేదని అంటున్నారు. దీంతో కోదాడ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయిందని అంటున్నారు.

శిరీష మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నా కూడా పెత్తనం మొత్తం ఆమె భర్త లక్ష్మీనారాయణ చేస్తున్నారు. దీనిపై టిఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా గతంలో అనేకసార్లు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వర్గీయులు లక్ష్మీనారాయణ కేంద్రంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో నియమించిన ఉద్యోగాలకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి శిరీష ను ప‌ద‌వి నుంచి దింపేసేందుకు ఎమ్మెల్యే ప్లాన్ చేస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కోదాడలో అధికార పార్టీ రెండు ముక్కలుగా చీలిపోవడంతో కేడర్ ఆందోళనలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: