పీఆర్‌సీపై క్లారిటీ వస్తుందా... ఉద్యోగుల్లో టెన్షన్...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... ఎంతో ఉత్కంఠగా ప్రభుత్వ ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు కూడా. ఇందుకు ప్రధాన కారణం... ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్‌సీ నివేదికపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం తిరుపతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వారం రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామన్నారు. చెప్పిన గడువు దగ్గర పడుతుండటంతో... ఇప్పుడు అందరి చూపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మళ్లింది. పీఆర్‌సీ సహా మొత్తం 71 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు ఉద్యోగ సంఘాల నేతలు. వీటిపై ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ... ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు... ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు.
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. వరుసగా మూడో రోజు కూడా తమ నిరసనలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయాల్లో విధులకు హాజరు అవుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ తేల్చాశారు. ఈ సమయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఆర్‌సీ నివేదిక అంశంపై జగన్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా ఎంత భారం పడుతుందనే విషయంపై అధికారులతో జగన్ చర్చించనున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే జీతాల చెల్లింపు కూడా ఆలస్యం అవుతోంది. ఈ పరిస్థితుల్లో పీఆర్‌సీ ప్రకటన వల్ల కలిగే ఇబ్బందులపై కూడా జగన్ చర్చించే అవకాశం ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే... 27 శఆతం మధ్యంతర భృతి ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: