విభజన హామీలు: రైల్వే జోన్‌పై తేల్చేసిన కేంద్రం...!

Podili Ravindranath
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడి 8 ఏళ్లు పూర్తి కావస్తుంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించిన కేంద్రం... అప్పట్లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఇందులో ప్రధానమైనది ప్రత్యేక రైల్వే జోన్. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌ తెలంగాణ రాష్ట్రంలో ఉండటంతో.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అప్పట్లో పార్లమెంట్ ఉభయ సభల్లో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం. అటు ఆదాయ పరంగా కూడా దక్షిణ కోస్తా జోన్ లాభదాయకమని ఇప్పటికే అధికారులు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అందించారు కూడా. దీనిపై దాదాపు నాలుగేళ్ల పాటు కాలయాపన చేసిన మోదీ సర్కార్... సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రం ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కీలకమైన కొన్ని మార్గాలను మాత్రం తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో కలపడం వల్ల విశాఖ జోన్ ఆదాయం పెద్దగా ఉండదని అప్పట్లో ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాల్తేరు డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్‌లను కలుపుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం హడావుడి ప్రకటన 2018లో చేసింది. కానీ ఇప్పుడు సరిగ్గా మూడేళ్ల తర్వాత ప్లేటు ఫిరాయించింది. దేశంలో ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేసే అవకాశమే లేదని కూడా లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. వారం రోజుల క్రితం డిసెంబర్ ఒకటవ తేదీన దక్షిణ కోస్తా జోన్ కోసం 40 లక్షల రూపాయలు కేటాయించామని ప్రకటించిన మంత్రి... మొత్తం 170 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేసినట్లు కూడా వెల్లడించారు. కానీ వారం రోజుల తర్వాత మాత్రం అసలు జోన్ సాధ్యం కాదని తేల్చేశారు. గతంలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన ఏపీ ఎంపీలు... కనీసం ఈ ప్రకటన సమయంలో సభలో కూడా కనిపించలేదు. ప్రత్యేక రైల్వే జోన్ వస్తే... అటు ఆదాయం పెరుగుతుందని... అదే సమయంలో ఉద్యోగావకాశాలు కూడా మెరుగుపడతాయని అంతా భావించారు. కానీ ఇవేవీ లేవని కేంద్రం తేల్చేసింది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: