సీజన్ 3 : ఒమిక్రాన్ ఓవర్ యాక్షన్ ఆపండహే!

RATNA KISHORE

వేల కోట్ల వ్యాపారం ఆగిపోయింద‌న్న బాధ‌లో మెడిక‌ల్ మాఫియా ఉన్న త‌రుణాన వారికి తాజా వేరియంట్ ఒమిక్రాన్ ఓ పెద్ద ఉప‌శ‌మ‌నం. అంతేకానీ జ‌నాల‌లో సైంటిఫిక్ టెంప‌ర్ పెంచుదాం అన్న ఆలోచ‌న కానీ క‌నీస స్పృహ కానీ ఉండ‌దు. అందుకే జ‌బ్బుల‌కు మందులు క‌న్నా జ‌బ్బుల‌కు సంబంధించిన భ‌యాలే ఎక్కువ‌గా మ‌నుషుల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. ఈ క్ర‌మంలో స‌మాజం మ‌ళ్లీ మ‌ళ్లీ తిరోగామి స్థితికి చేరుకుంటోంది.



మ‌నుషులు ఎలా ఉన్నా ఏం చేసినా ఏం చేయ‌కున్నా కూడా కొన్ని భ‌యాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. వాటిని దాటి త‌మ జీవితాల‌ను సుసంపన్నం చేసుకోవాల‌న్న ఆలోచ‌నే చేయ‌రు. క‌రోనా త‌రువాత ప్ర‌పంచం ఏం మారిందో తెలియ‌దు కానీ బొత్తిగా కామ‌న్ సెన్స్ లేకుండా మ‌నుషులు ఉంటూ, చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణాన్నీ వింత వాద‌న‌తో నింపుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ రాక కార‌ణంగా మ‌ళ్లీ క‌రోనా భ‌యాలు రెట్టింపు అయ్యాయి. గ‌త ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్డౌన్ ఉంటుంద‌న్న వాద‌న కూడా  వినిపించింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఏవిధంగా జీవితాన్ని నాశ‌నం చేస్తుంది అన్న‌ది దానికి ఇంకా ప్ర‌యోగ ఫ‌లితాలు లేనే  లేవు. అన్ని క‌రోనా వైర‌స్ లూ అన్ని వేరియంట్లూ ప్రాణాంత‌కం కావు కానీ రుగ్మ‌త‌కు కార‌కాలు..అని వైరాల‌జీ నిపుణులు చెప్పినా కూడా జ‌నాల‌కు అవేవీ ప‌ట్ట‌వు.



క‌రోనా పేరిట రెండేళ్ళ పాటు ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా చితికి పోయింది. దేశాలు ఎటు వైపు పోతున్నాయో తెలియ‌ని అయోమ‌యంలో ఉన్నాయి. ఈ ద‌శ‌లో చైనా వైర‌స్ ద‌క్షిణా వేరియంట్ అన్న‌వి  తెగ చంపుకు తింటున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ అనే వేరియంట్ భ‌యం మా శ్రీ‌కాకుళం జిల్లా సంత‌బొమ్మాళి మండ‌లం, ఉమ్మిలాడ గ్రామాన్ని సైతం వణికిస్తోంది. ఇక్క‌డ ఓ కేసు న‌మోదు కావ‌డంతో వెంట‌నే ఈ ఏరియాను కంటైన్మెంట్ జోన్ గా ప్రక‌టించి అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఏది ఎలా ఉన్నా భ‌యం అన్న‌ది అటు ప్ర‌జ‌ల‌ను ఇటు అధికారుల‌ను ఏక కాలంలో ప‌రుగులు తీయించేలా చేస్తోంది. అయితే వాస్త‌వానికి ఇంత‌వ‌ర‌కూ ఒమిక్రాన్ వేరియంట్ పేరిట ఒక్క‌టంటే ఒక్క మ‌ర‌ణం కూడా సంభవించ‌లేదు అని నిపుణులు చెబుతున్నారు. క‌రోనా సోక‌కుండా ఉండేందుకు తీసుకున్న జాగ్ర‌త్త‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ పాటిస్తే చాలు అని వైద్యులు చెబుతున్నారు. అయినా కూడా మార్కెట్లో భ‌యం మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: