ఫ్యాన్ ఆంధ్రా : డైలమాలో జగన్..ఏం చేద్దాం..కొట్టు కట్టేద్దాం!

RATNA KISHORE
కొట్టు కట్టేద్దాం అన్న మాట ఏం తప్పు కాదు కానీ తప్పేలా లేదు. ఎందుకంటే ఎక్కడా ఆర్థికంగా నిలదొక్కుకున్న దాఖలాలు అయితే లేవు. ఆస్తుల తాకట్టు తప్ప సంపద సృష్టి అన్నది చేసిందే లేదు అన్నది ఓ చేదు నిజం. అందుకే జగన్ మునుపటి వేగంతో నిర్ణయాలు వెలువరించలేక అవస్థలు పడుతున్నారు. పోనీ పార్టీ ఏమయినా బాగుందా అంటే అది కూడా అలానే ఉంది. క్షేత్ర స్థాయిలో ఎదుగుదల లేకుండా ఉంది. వీటితో పాటు ఉద్యోగుల వార్నింగులు, గ్రామ సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఇలా చాలా విషయాలు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు సీపీఎస్ రద్దుపై నిర్ణయం చెప్పలేని అవస్థ ఆయనది. పోనీ సీపీఎస్ మాటెలా ఉన్నా రాష్ట్ర ఖజానాకు వనరులు తెచ్చే బాధ్యతలో ఆయన ఓడిపోతున్నారు. అప్పులే అవధిగా చేసుకుని పాలన సాగిస్తున్న వైనంపై ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. అయినా కానీ జగన్ కు వణకు లేదు. భయం లేదు. ఆందోళన అన్న పదం ఆయన డిక్షనరీలోనే లేదు. కనుక కొట్టు కట్టేసి ముందస్తుకు వెళ్లినా వెళ్తారు........


ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెచ్చుకున్న అధికారం ఇప్పుడు ఆయనకు ఏమాత్రం కలిసి రావడం లేదు. రెండున్నరేళ్లకే ఖజానా దివాలా తీయడంతో కొత్త సమస్యలు పరిష్కరించలేక, పాత అప్పులు తీర్చలేక తీవ్ర ఒత్తిడిలో ఇవాళ జగన్ ఉన్నారు. ముందస్తుకు పోయి తన నిజాయితీనో లేదా నిబద్ధతనో నిరూపించుకుని తీరాలన్న తాపత్రయం ఆయనలో ఉంది. కానీ ఇప్పటికిప్పుడు పోల్ మేనేజ్మెంట్ కు డబ్బులు ఎక్కడి నుంచి తేవడం? గత ఎన్నికల్లో అయితే అన్నీ తానే అయి పార్టీ తరఫున నిధులు ఇచ్చి అభ్యర్థులకు ఏ కష్టం రాకుండా చూసుకున్న మాట అయితే వాస్తవం. అప్పట్లో కేసీఆర్ మరియు బీజేపీ కూడా ఆయనకు అండగానే ఉన్నారు. మరిప్పుడు అలానే ఉంటారా?


అప్పుల్లో ఆంధ్రావని అన్న మాటకు జగన్ అస్సలు ఉలిక్కి పడడం లేదు. మూడున్నర లక్షల కోట్ల అప్పుపై ఎటువంటి బెంగా లేదు. ఒక్కో కుటుంబానికి దాదాపు ఐదు లక్షలకు పైగా అప్పు ఉందన్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఆయనే కాదు ఎవ్వరూ  పట్టించుకోవడం లేదు. ఆఖరికి కేంద్రం వచ్చి హెచ్చరించినా కూడా జగన్ ఎక్కడా తగ్గడం లేదు. అప్పులు చేసి మరీ జనాలకు నోట్లు పంచి పెట్టే పథకాలకు కొనసాగింపు ఇవ్వడం అన్నది జగన్ కే సాధ్యం. దేశంలోనే ప్రప్రథమంగా లక్ష కోట్ల రూపాయలను సంక్షేమానికి వెచ్చిస్తున్న నేపథ్యంలో ఆఖరికి కేంద్రం కూడా తామేం చేయలేమనే చెబుతుంది. ప్రతి నెలా జీతాలకే తెచ్చిన అప్పులు సరిపోతున్నా కూడా జగన్ ఎక్కడా అదరడం లేదు బెదరడం లేదు. అప్పులు తెచ్చేందుకు ఏకంగా ఒక సలహాదారును కూడా  నియమించుకున్నారాయన. ఈ తరుణంలో మరి అప్పులు పుట్టవు అని తేలిపోయాక క్యాబినెట్ విస్తరణ చేసి కొంత కాలం పాలించాక ముందస్తుకు పోవాలా లేదా ఇప్పుడున్న క్యాబినెట్ తోనే ముందస్తుకు పోవాలా అన్నది తేలక సతమతమవుతున్నారు జగన్. సంక్రాంతి తరువాత ఆయన జిల్లాల పర్యటన చేపట్టే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. ఆ విధంగా ఆయన జిల్లాలకు వచ్చి, సమస్యలు తెలుసుకుని  క్షేత్ర స్థాయిలో తన ప్రభుత్వ పనితీరును అంచనావేశాకే ఓ నిర్ణయం తీసుకుంటారని కూడా ఓ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: