అమ్మో..! ఒమిక్రాన్ కొత్త రూపం దాల్చిందా..?

NAGARJUNA NAKKA
ఇప్పటికే ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో వార్త గుబులు పుట్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కొత్త వెర్షన్ ని ఆస్ట్రేలియా వైద్యులు గుర్తించారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ కి వచ్చిన ఓ యాత్రికుడు ఈ కొత్త వెర్షన్ తో బాధపడుతున్నట్టు అక్కడి వైద్యశాఖ తెలిపింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఒమిక్రాన్ కొత్త వెర్షన్ ను అధికారికంగా ప్రకటించింది.
బ్రిటన్ లో ఒకే రోజు 101 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటన్ ఆరోగ్య అధికారులు తెలిపారు. కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ఆ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బ్రిటన్ ప్రభుత్వం.. ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ప్రమాదకర వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు క్రమంగా వ్యాపిస్తోంది.
ఒమిక్రాన్ పై తాము అభివృద్ధి చేసిన యాంటీ బాడీ ఆధారిత చికిత్స సత్ఫలితాలు ఇస్తోందని ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్ క్లైన్ వెల్లడించింది. అమెరికాలో వీర్ బయోటెక్నాలజీతో కలిసి సొట్రొవిమ్యాన్ అనే ఔషధంతో చికిత్సను రూపొందించినట్టు తెలిపింది. మ్యూటేషన్లపై దీని ప్రభావాన్ని తాము గుర్తించామని పేర్కొంది. ఈ క్లినికల్ పరీక్షలోని ఫలితాలను వైద్య పత్రికలు సమీక్షించాల్సి ఉందని తెలిపింది.
ఇక మనదేశంలో నిన్న తగ్గిన కరోనా కేసులు ఈ రోజు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 8వేల 439పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవి 23శాతం ఎక్కువని కేంద్రం తెలిపింది. 9వేల 525 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 195మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 93వేల 733 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 46లక్షల 56వేల 822కు చేరింది. మొత్తం 4లక్షల 73వేల 952మంది మరణించారు.
ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమై చర్యలు తీసుకుంటోంది. సంగారెడ్డి జిల్లాలో వ్యాక్సిన్ వేసుకోని వారి ఇళ్లకు అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. జహీరాబాద్ మండలం శేఖాపూర్ మొత్తం జనాభా 4వేల 284. టీకాలు వేసుకోవాల్సిన వారు 2వేల 92. వేసుకున్న వారు 1,102మాత్రమే. ఈ క్రమంలోనే టీకా వేసుకోని వారికి ఐదు రోజులుగా అధికారులు అనధికారికంగా రేషన్ పంపిణీ నిలిపివేశారు. టీకా తీసుకునేందుకు ఒప్పుకోవడంతో కరెంట్ సరఫరా పునరుద్ధరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: