వాళ్ల‌ను మార్చ‌లేం.. వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌..!

VUYYURU SUBHASH
`` కొంద‌రిని మార్చ‌లేం సార్‌. అంతే! వారు మార‌రు. మ‌న‌మే మారాలి.. ! `` ఇదీ ఇప్పుడు అధికార పార్టీ వైసీ పీలో సాగుతున్న హాట్ టాపిక్‌. దీనికి కార‌ణం.. టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరే అంటున్నారు ప‌రిశీలకులు. ఇటీవ‌ల క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాలు.. చిత్తూరు లోనూ భారీ ఎత్తున వ‌ర‌ద పోటెత్తింది. దీంతో గ్రామాల‌కు గ్రామాలే కొట్టుకుపోయాయి. ఇక‌, కీల‌క‌మైన అన్న‌మ‌య్య ప్రాజెక్టు మ‌ట్టిక‌ట్ట కూడా కొట్టుకు పోయింది. దీని పై అనేక రూపాల్లో ప్ర‌తిప‌క్షం టీడీపీ, అధికార ప‌క్షం వైసీపీల మ‌ధ్య తీవ్ర వ్యాఖ్య‌ల యుద్ధం జ‌రుగుతోంది. క‌నీసం ప్రాజెక్టుల  గేట్ల‌ను కూడా ప‌రిర‌క్షించ‌డం చేతగాని నాయ‌కులు.. రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యంలో మ‌రింత దూకుడుగా ఉన్నారు. దీంతో ప్ర‌భుత్వం పై ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను ఎక్కు పెట్టారు. ఈ ప‌రిణామాల‌పై వైసీపీ నేత‌లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ``మా ప్ర‌భుత్వంలోనే వ‌ర‌ద‌లు, వ‌ర్షాలు వ‌చ్చిన‌ట్టు చంద్ర‌బాబు మాట్లాడుతున్నారు. ఆయ‌న వైఖ‌రి ఇప్ప‌ట్లో మార‌దు. ప్ర‌జ‌లు అన్ని వైపుల నుంచి ఆ పార్టీని ఓడిస్తున్నారు. అయినా..ఆయ‌న మాత్రం ప్ర‌జ‌ల‌ను బ‌ట్టి మార‌డంలో మాత్రం వెనుక‌బ‌డే ఉన్నారు. కొంద‌రిని మార్చ‌లేం సార్‌!!`` అని పెద‌వి విరుస్తున్నారు.

ఇక‌, ఇదే విష‌యం.. మంత్రి వ‌ర్గంలోనూ చ‌ర్చగా మారింది. చంద్ర‌బాబు హయాంలోనే అన్న‌మ‌య్య ప్రాజెక్టు దెబ్బ‌తింద‌నే నివేదిక‌ను మంత్రి అనిల్ కుమార్ ప్ర‌స్తావించారు. 2017లోనూ ఈ ఆన‌క‌ట్ట‌కు సంబంధించిన నివేదిక వ‌చ్చింద‌ని.. దీనిలో స్ప‌ష్టంగా అది దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపార‌ని.. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు త‌మ‌పై ఎదురు దాడి చేస్తున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

అదేవిధంగా పున‌రావాస కేంద్రాల్లోని వారికి, అనంత‌రం.. వ‌ర‌ద బాధితుల‌కు కూడా ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింద‌ని.. అయిన‌ప్ప‌టికీ ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా ఎవ‌రూ చూడ‌కుండా.. కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష నేత‌లు మారే అవ‌కాశం లేద‌ని.. వారు అంతేన‌ని వైసీపీ నేత‌లు స్థిర నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. భ‌విష్య‌త్తులోనూ వీరు చేసే వ్యాఖ్య‌ల‌కు స్పందించాల్సిన అవస‌రం లేద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: